సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

12
Minister V Srinivas Goud

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద రూ. 11 లక్షల 16 వేల చెక్కులను ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని భగీరథ కాలనీలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే వీరన్న పేటలో హెచ్.ఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ముస్లిం గ్రేవ్ యార్డ్ అభివృద్ధి కోసం రూ. 13 లక్షలతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. టి.డి గుట్ట చౌరస్తా వద్ద రూ.17.50లక్షలతో చేపట్టనున్న సి.సి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, మున్సిపల్ చైర్మన్ కె.సి. నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వివిధ రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించినట్లు వివరించారు. ఎంతోమంది పేద ప్రజలకు వారి ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా రూ. లక్ష నుంచి రూ. 10 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ కింద ఇస్తున్నామన్నారు. గతంలో జబ్బు చేస్తే పేద వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వివిధ రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించామని మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారని తెలిపారు.