తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భముగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలోని జోనల్, సర్కిల్, డివిజన్, సబ్-డివిజన్ కార్యాలయాల్లో, ERO కార్యాలయాల్లో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా మెట్రో జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యుత్ అంబుడ్స్మన్ శ్రీ నాగరాజు గారు, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జి రఘుమా రెడ్డి గారు ముఖ్య అతిధులుగా హాజరైనారు.
సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి మాట్లాడుతూ, వినియోగదారుడు సంస్థకు భగవంతుడు లాంటి వారని, వారికి సంతృప్తికర సేవలు అందించినప్పుడే సంస్థ కు మనుగడ ఉంటుందన్నారు. వినియోగదారుడు సంస్థ పై ఆధారపడలేదు, మనమే వారిపై ఆధారపడ్డామనే విషయం దృష్టిలోపెట్టుకుని వివిధ సేవల కోసం తమ వద్దకు వచ్చే వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సిబ్బందికి, అధికారులను సూచించారు. వినియోగదారుల సౌకర్యార్ధం సంస్థ ఎప్పటికప్పుడు నూతన పద్ధతులు ప్రవేశపెడుతున్నదని, నూతన సర్వీసుల మంజూరు, పేరు మార్పు, బిల్లింగ్ సవరణ వంటి వివిధ సేవల కోసం సంస్థ వెబ్సైటు, ఆప్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే చంద్ర శేఖర్ రావు గారి, గౌరవ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జి జగదీష్ రెడ్డి గార్ల తోడ్పాటుతో అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా గావిస్తున్నామన్నారు. రాష్ట్రము ఏర్పడినప్పటి నుండి విద్యుత్ పంపిణి వ్యవస్థ పటిస్టికరణ కోసం సంస్థ పరిధిలో రూ. 11,855 కోట్ల వ్యయంతో వివిధ పనులు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుండి విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, 2014 లో 4989 మెగావాట్లుగా నున్న గరిష్ట డిమాండ్ 8474 మెగా వాట్లకు పెరిగింది. 101.72 మిలియన్ యూనిట్లు గా నున్న విద్యుత్ వాడకం 180.51 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు.
విద్యుత్ అంబుడ్స్మన్ శ్రీ నాగరాజు గారు మాట్లాడుతూ, విద్యుత్ వినియోగదారుల శ్రేయస్సు కోసం వివిధ హక్కులు కల్పించబడ్డాయని, సరఫరా బిల్లింగ్ మరియు విద్యుత్ సంబంధిత పనుల్లో ఎలాంటి జాప్యం ఏర్పడ్డా ” కన్స్యూమర్ గ్రీవెన్సెస్ రిడ్రెస్సల్ ఫోరమ్ ” కు ఫిర్యాదు చేయగలరని, ఒక వేళ సమస్య పరిష్కారం కాకుంటే విద్యుత్ అంబుడ్స్మన్ గారికి అప్పీల్ చేసుకునే సదుపాయం ఉన్నదన్నారు. విద్యుత్ శాఖలో సెక్షన్ ఆఫీసర్లు కీలకమని, పౌర సేవ పత్రం ప్రకారం విధులు నిర్ణీత సమయంలో పూర్తిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వినియోగదారులు పాలోని సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. తాజ్ బంజారా చీఫ్ ఇంజనీర్ శ్రీ ML శర్మ గారు మాట్లాడుతూ రాష్ట్రము ఏర్పడ్డాక నిరంతర విద్యుత్ సరఫరా అందుతున్నదని HT వినియోగదారుల సమస్యలు వెంటనే పరిష్కరింప బడుతున్నాయన్నారు. మరో వినియోగదారుడు శ్రీ కృష్ణ మాట్లాడుతూ సంస్థ ప్రవేశ పెట్టిన ఆన్లైన్ పద్దతి చాలా సౌకర్యంగా ఉన్నదన్నారు. సంస్థ డైరెక్టర్లు శ్రీ కే రాములు, శ్రీ ఎస్ స్వామి రెడ్డి, CGM మెట్రో జోన్ శ్రీ నరసింహ స్వామి, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు వినియోగదారులకు అందిస్తున్న వివిధ సేవల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపెరింటెండింగ్ ఇంజినీర్లు శ్రీ బ్రహ్మం, శ్రీ రవి కుమార్, శ్రీ ఖాజా అబ్దుల్ రహమాన్, శ్రీ చంద్ర శేఖర్, శ్రీ కామేష్, డివిజనల్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.