తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనదైన పాలనతో ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. హంగుఆర్భాటాలకు దూరంగా ఉండే స్టాలిన్.. తాజాగా ఓ వృద్దురాలికి అండగా నిలిచారు. తాను ముఖ్యమంత్రి అయితేనేం.. ఒక సాధారణ వ్యక్తినేనంటూ నిరూపించారు. వివరాల్లోకి వెళ్లితే.. సీఎం స్టాలిన్ సోమవారం తమిళనాడులోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తిరుచీకి వెళ్ళే మార్గంలో.. ఒక వృద్దురాలు.. దరఖాస్తుతో రోడ్డు వెంట నిల్చొని ఎదురు చూస్తోంది.
కాన్వాయ్ ముందుకు వెళుతున్న ఈ క్రమంలో.. అర్జీతో ఉన్న మహిళను చూసిన సీఎం స్టాలిన్ కాన్వాయ్‌ను ఆపి ఆ మహిళ దగ్గర ఫిర్యాదును స్వీకరించారు. అంతేకాదు వెంటనే దానిపై సంతకం చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రే.. అర్జీ తీసుకోవడంతో ఆ వృద్ధురాలు అనందంతో వెనుదిరిగింది. ఈ సంఘటనను చూసిన నెటిజన్లంతా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను అభినందిస్తున్నారు.