సీఎం సిద్దరామయ్య స్లీపింగ్‌..

867
- Advertisement -

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోమారు అనూహ్య రీతిలో తెరమీదకు వచ్చారు. గతంలో చేతిలో నిమ్మకాయతో కనిపించినా..రాష్ర్టానికి సొంత జెండా ఏర్పాటుచేసేందుకు కమిటీ వేసినా…ఆయన స్టైలే డిఫరెంట్. అలాంటి సిద్ధరామయ్య తాజాగా ఆసక్తికరమైన పరిణామంతో తెరమీదకు వచ్చారు. ఓ వైపు పార్టీ సమావేశం జరుగుతుండగానే…నిద్రపోయారు. తాజాగా ఆయన గుర్రుపెట్టి నిద్రపోతున్న ఫోటోలు, వీడియోలు చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

CM Siddaramaiah Sleeping During Congress Meeting

మంగళవారం కర్నాటకలో జరిగిన ఓ పార్టీ సమావేశం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అటూ ఇటూ ఊగుతూ, ముక్కున వేలేసుకుని ఆపసోపాలు పడుతూ నిద్రపోతున్నా… కెమేరాలు తదేకంగా ఆయన్నే జూమ్ చేస్తున్నా… సీఎం పక్కన కూర్చున్నవాళ్లెవరూ కనీసం ఆయనను పట్టించుకున్న పాపానపోలేదు. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో సీఎం చిత్రమైన హావభావాలు ఆయనే పగలబడి నవ్వుకునేలా ఉన్నాయి.

సీఎం సిద్దరామయ్య పబ్లిక్ వేదికలపై ఇలా దర్శనమివ్వడం ఇది కొత్తేం కాదు. గతేడాది మేలో ఏకంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్సులో ఆయన నిద్రపోతూ కనిపించారు. 2016లో ప్రధాని మోదీ కూడా హాజరైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లోనూ, అసెంబ్లీ కార్యక్రమాల్లోనూ ఆయన కునికిపాట్లు పడ్డారు. ఇక 2014లో అయితే ఏకంగా మూడు పబ్లిక్ మీటింగుల్లో సీఎం సిద్దరామయ్య జోగడంతో…. కెమేరాలు పండగ చేసుకున్నాయి. అయితే స్లీపింగ్ డిజార్డర్ రుగ్మత ఎదుర్కొంటున్న ఈ సీఎం.. నిద్రావస్థను అధిగమించడానికి ప్రత్యేక ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఓ యోగా గురువు సూచన మేరకు నిద్ర తిప్పల నుంచి బయట పడటానికి ఇటీవలే ఆయన ఆసనాలు కూడా మొదలెట్టారట. కానీ, ఇవేవీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి.

- Advertisement -