మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో సమగ్ర కోర్ అర్బన్ చట్టం రూపకల్పన చేయాలని సూచించారు. ఓఆర్ఆర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు ఒకే చట్టం వర్తింపజేసి, అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనులన్నీ అదే చట్టం ఆధారంగా నిర్వహించాలన్నారు.
ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని శాఖల రోడ్లను MAUD పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, చెత్త వేసే ప్రదేశాలను గుర్తించి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణంలో బాధ్యత నిర్ణయించి, వాటికి జీవితకాలం ఖరారు చేసి ముందే దెబ్బతిన్నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి వీధి దీపం పనితీరును డ్యాష్‌బోర్డ్‌లో చూపించే విధంగా స్మార్ట్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో ఫుడ్ సేఫ్టీ కట్టుదిట్టం చేసి, హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని, రేటింగ్ విధానం అమలు చేయాలని ఆదేశించారు.
50 అంతస్తుల పైబడిన భవనాలకు ఆధునిక ఫైర్ సేఫ్టీ సదుపాయాలు తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. ప్రతి సర్కిల్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి భూగర్భజలాలను పెంపొందించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్ల రూపకల్పన వేగవంతం చేయాలని ఆదేశించారు.
Also Read:Ind Vs Wi:మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే?
చారిత్రాత్మక కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, హైడ్రా పరిరక్షించిన చెరువులకు రక్షణతో పాటు పర్యాటక అభివృద్ధి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరాభివృద్ధి సమగ్రంగా, సుస్థిరంగా సాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

