భారత దేశాన్ని ప్రపంచ దేశాలకే ఆదర్శవంతంగా తీర్చిదిద్దవచ్చని నిరూపించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించిన సీఎం, దేశ నిర్మాణంలో బాబాసాహెబ్ పోషించిన అద్వితీయ పాత్రను స్మరించుకున్నారు.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని అంబేద్కర్ ఆనాడే మార్గదర్శనం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లే నేడు దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం లభిస్తున్నాయని చెప్పారు.
దేశ బలోపేతంలో అంబేద్కర్ పాత్రను వివరిస్తూ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.స్వతంత్ర భారత పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశం ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఎదగడంలో అంబేద్కర్ పాత్ర కూడా అంతే ఉంది” అని ఆయన స్పష్టం చేశారు.దేశాభివృద్ధికి గాంధీజీ అహింసా మార్గాన్ని చూపిస్తే, అంబేద్కర్ రాజ్యాంగబద్ధమైన హక్కుల ద్వారా సామాజిక విప్లవానికి బాటలు వేశారని కొనియాడారు.
అంబేద్కర్ కేవలం ఒక వర్గానికో లేదా ఒక దేశానికో పరిమితం కాలేదని, ఆయన ఆలోచనలను మరియు విధానాలను నేడు ప్రపంచం మొత్తం స్వాగతించిందని రేవంత్ రెడ్డి అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం అంతర్జాతీయ స్థాయిలో మేధావులను సైతం ఆకర్షించిందని గుర్తు చేశారు.తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే పాలన సాగిస్తోందని, సామాజిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. బాబాసాహెబ్ చూపిన మార్గంలో నడుస్తూ, రాష్ట్రంలోని పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. భారత రాజ్యాంగం ద్వారా ఆయన మనకు అందించిన హక్కులే నేడు మనందరికీ శ్రీరామరక్ష అన్నారు రేవంత్.
Also Read:‘డెకాయిట్’..మంచి సినిమా తీశాం!

