దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత నావికాదళం విఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా పూడూరు మండల ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకుందని అన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. #VLF రాడార్ కేంద్రం వల్ల స్థానికులకు గానీ ఈ ప్రాంతానికి గానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు.
రక్షణ శాఖకు హైదరాబాద్ మొదటి నుంచి వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది. అనేక రక్షణ పరిశోధనా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయన్నారు. రాజకీయాల్లో సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
ఈ ప్రాజెక్టు ఏర్పాటు నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. రక్షణ శాఖ మంత్రి గారు అడిగిన వెంటనే మేం కార్యాచరణను ముందుకు కొనసాగించాం అన్నారు. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం. ఈ ప్రాజెక్టు కారణంగా స్థానికులకు, పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు అన్నారు. 1990 లో తమిళనాడులో ఏర్పాటు చేసిన వీఎల్ఎఫ్ వల్ల ప్రజలకు, ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అన్నారు.
Also Read:KTR:విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే బీఆర్ఎస్ సహించదు
ఇక్కడ 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. మందిరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి…నావికా దళం ఇక్కడ ఏర్పాటు చేసే విద్యా సంస్థల అడ్మిషన్లలో స్థానికులకు మూడింట ఒకవంతు అవకాశం కల్పించాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందన్నారు.