భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, గ్యారంటీలను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ‘ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ..’ తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రఖ్యాత మలయాళీ దినపత్రిక #Mathrubhumi వారు తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన “మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్” సదస్సు (#MBIFL2025)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అలాగే, మాతృభూమి ఎడిటర్ మనోజ్ కె.దాస్ గారు, కొందరు సభికులు ముఖాముఖి అడిగిన ప్రశ్నలకూ ముఖ్యమంత్రి గారు సమాధానాలిచ్చారు.
దశాబ్దాలపాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దక్షిణాదిని శిక్షిస్తున్నారా? చెప్పాలన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాష్ట్రాన్ని నిలబెట్టేలా తెలంగాణ రైజింగ్ నినాదంతో సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి కార్యాచరణ తీసుకున్నాం. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను ఇప్పటికే అమలు చేస్తున్నాం అన్నారు.
అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారుతోంది. ఇటీవల దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి రూ.1.82 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి.. పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు అన్ని వర్గాలకు సంక్షేమాన్నీ సమర్ధవంతంగా అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా, ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా, భూమి లేని కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం అన్నారు.
Also Read:రోహిత్ సెంచరీ..టీమిండియా గెలుపు
దేశంలోనే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం… సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం. సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను అమలుకు పూనుకున్న తొలి రాష్ట్రం కూడా తెలంగాణే. ఈ అంశాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 4వ తేదీని ఏటా ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా జరుపుకుంటాం. జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వనరులు సమకూర్చుతాం అన్నారు.

