సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన షెడ్యూల్‌..

57
- Advertisement -

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన రోడ్డు మార్గం ద్వారా యాదాద్రి వెళ్తారు. ముగింపు దశలో ఉన్న ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తారు. ఆలయ పున: సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. మార్చి 22 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయస్థాయిలో ఘనంగా జరిగే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున: సంప్రోక్షణ జరపాలని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశవిదేశాల నుంచి యాదాద్రి పున: ప్రారంభ వేడుకలకు వచ్చే అతిథులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే జనం కోసం కల్పించే సౌకర్యాలపై ఆయన దృష్టిసారిస్తారు.

తెలంగాణా ధార్మిక రాజధానిగా అవతరించబోతున్న యాదాద్రి పునర్నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రి పర్యటించనున్నారు. ఆలయ పున: సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండటంతో అక్కడ యాగశాల నిర్మాణం, ఇతర పనులు, ఏర్పాట్లను సీఎం సమీక్షించనున్నారు. గతంలో ప్రకటించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే మొదలవుతాయి. ఇందుకోసం 120 కిలోల బంగారం అవసరం పడుతుంది. దీంట్లో 30 కిలోల బంగారానికి సరిపడ నగదు ఇప్పటికే సమకూరగా, మరో 40 కిలోల బంగారం వివిధ వర్గాల నుంచి అందింది. ఈ 70 కిలోలు పోను మరో 50 కిలోల బంగారాన్ని సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రధాన ఆలయ ముఖద్వారం, ధ్వజస్థంభం, బలిపీఠాలకు బంగారు తాపడం పనులు చివరిదశలో ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 13 కిలోల బంగారం పట్టింది. చెన్నై స్మార్ట్ క్రియేషన్ సంస్థ ఈ పనులు చేపట్టింది.

సీఎం కేసీఆర్ దార్శనికతలో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన యాదాద్రి పుణ్యక్షేత్ర పున: సంప్రోక్షణ కార్యక్రమాలను నభూతో, నభవిష్యతి అన్నచందంగా వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మార్చి 22 వ తేదీన సుదర్శన యాగంతో ప్రారంభమై 28 వ తేదీ అర్ధరాత్రి పున: ప్రారంభ కార్యక్రమాలు ముగుస్తాయి. సుదర్శన యాగంలో 1108 యజ్ఞగుండాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో యజ్ఞగుండానికి కనీసం 6 గురి చొప్పున దాదాపు 6 వేల పైచిలుకు రుత్విక్కులు పాల్గొంటారు. మార్చి 22 వ తేదీన బాలాలయాన్ని మూసివేసి మూలవిరాట్టును యగశాలకు తరలిస్తారు. అప్పటి నుంచి పున: ప్రతిష్ట జరిగే వరకు సందర్శకులు స్వామివారిని యగశాలలోనే దర్శించుకోవాల్సి ఉంటుంది. తిరిగి 28 వ తేదీ అర్ధరాత్రి కొత్త ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. మార్చి 29 వ తేదీ తెల్లవారుజాము నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు, యాత్రికులు, సందర్శకులను అనుమతిస్తారు.

అంతర్జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా సాగే పున: ప్రారంభ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆ మధ్య కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా యాదాద్రి పుణ్యక్షేత్రం పున: సంప్రోక్షణ కార్యక్రమానికి ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా ప్రముఖులను, ముఖ్యులను స్వయంగా తానే కలిసి యాదాద్రి పున: ప్రారంభ వేడుకలకు ఆహ్వానిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న మతాధిపతులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మార్చి నెలలో వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి కోట్లాదిగా జనం తరలివస్తారని ప్రభుత్వ అంచనా.

- Advertisement -