తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను టిఆర్ఎస్ పార్టీ సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘టిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఆరేళ్లలో అనేక అద్భుతాలు సాధించింది. సంక్షేమం, విద్యుత్, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు నమోదు చేసింది. ప్రజలు దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించింది. టిఆర్ఎస్ పార్టీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఇది టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
‘‘టిఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచిన సందర్భంగా గొప్పగా జరుపుకోవాల్సిన వేడుకులను కరోనా వైరస్ నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఈ సారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా ఎక్కడికక్కడే పతాకావిష్కరణ చేయాలి. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలి.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఖచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9.30 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పతాకావిష్కరణ చేస్తారు.