ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజా ప్రతినిధులు, నాయకులు రాజ్ భవన్ వెళ్లి శుభాకాంక్షలు తెలపడం పట్ల గవర్నర్ నరసింహన్ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం మద్యాహ్నం రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ ను కలుసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంకించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ తాను 70 ఏళ్లుగా పుట్టిన రోజలు జరుపుకుంటున్నప్పటికీ ఇంత ఆనందంగా ఎన్నడూ లేనని గవర్నర్ అన్నారు. “మొత్తం రాష్ట్రమంతా ఇక్కడే ఉన్నట్టుంది. నేను రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగానే ఉంది. డెబ్భై ఏళ్లుగా పుట్టిన రోజులు జరుపుకుంటున్నప్పటికీ ఇంత ఆనందం ఎన్నడూ కలగలేదు. ఈ పుట్టిన రోజును జీవితంలో ఎన్నడూ మరిచిపోలేను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు నా పుట్టిన రోజు నాడు వచ్చి నాకు శుబాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రానికి మొదటి గవర్నర్ కావడం, పురోగమిస్తున్న రాష్ట్రంలో నా భాగస్వామ్యం ఉండడం సంతోషాన్నిస్తుందన్నారు.
భవిష్యత్తులో తెలంగాణ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఆ రాష్ట్రానికి మొదటి గవర్నర్ గా పనిచేశాను అనే తృప్తి నాకుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మంత్రులు, ప్రతీ ఒక్కరు సమిష్టిగా కష్టపడుతున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మీ సమిష్టి కృషి అద్భుతం. మీ ముఖాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామనే నమ్మకం కనిపిస్తుంది. 29నెలల రెండు రోజుల నుంచి ఈ రాష్ట్రాన్ని గమనిస్తున్నాను. ఎంతో పురోగమించింది. వేగంగా ముందుకుపోతున్నది. ఇంకా అనేక మైలురాళ్లు అధిగమిస్తుందనే విశ్వాసం కనిపిస్తున్నది. నేను, ముఖ్యమంత్రి అనేక సార్లు ముఖాముఖి మాట్లాడుకున్నాం. ఎప్పుడూ అభివృద్ధి గురించే చర్చించుకుంటాం. అభిప్రాయాలు పరస్పరం పంచుకుంటాం. రాష్ట్రం ముందుకుపోవడం గురించి చర్చిస్తాం’ అని గవర్నర్ చెప్పారు.
ముఖ్యమంత్రితో పాటు స్పీకర్ మధుసూదనా చారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, వివిద కార్పొరేషన్ల చైర్మన్లు గవర్నర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపి, పాదాభివదనం చేసి ఆశ్సీసులు పొందారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రతీ ఒక్కరికీ గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు.