తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రితో భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, పలువురు ఎంపీలు ఉన్నారు.
శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
రెండోసారి ప్రధాని అయ్యాక నరేంద్ర మోడీతో కేసీఆర్ భేటీ కావడంఇదే తొలిసారి. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పెంచడంతోపాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు.
ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకాన్ని స్వయంగా ప్రధానే రాష్ట్రానికి వచ్చి ప్రారంభించారు. ఈ పథకానికి ఆర్థికసాయం అందించాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. ఈ రెండు పథకాలకు ఆర్థిక సహాయమివ్వాలని ప్రధానిని ఈ భేటీలో కోరనున్నారు. కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణకు భూములు ఇవ్వాలని ఇదివరకే కేంద్రాన్ని సీఎం కోరారు. తాజాగా మరోసారి ఈ భూమిని ఇచ్చే విషయంపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు.