ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు పార్థవ దేహాన్ని శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సందర్శించి నివాళులర్పించారు. హబ్సిగూడలో విద్యాసాగర్ రావు ఇంటికి సతీ సమేతంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానభూతి తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి విషణ్ణ వదనంతో కనిపించారు. విద్యాసాగర్ రావు లేని లోటు భర్తి చేయలేనిదని అన్నారు.
విద్యాసాగర్ రావుతో ఉన్నఅనుబంధాన్ని మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో పంచుకున్నారు. నీళ్ళు-నిజాలు అనే పుస్తకాన్ని రాసి సాగునీటి రంగంపై అందరికీ అవగాహన కల్పించారన్నారు. విద్యాసాగర్ రావు గొప్ప తెలంగాణ వాది అని , తెలంగాణ రావాలనే తపన పడేవారని గుర్తుచేశారు.
రాష్ట్ర్రవ్యాప్తంగా తిరిగి ఎన్నో సభల్లో,సదస్సుల్లో మాట్లాడారన్నారు. తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ప్రతి చోటా వివరించుకుంటూ వచ్చారన్నారు. రాష్ట్ర్ర సాధన జరిగిన తర్వాత కూడా నీటి పారుదలశాఖ రంగంలో విశేషమైన సేవలు అందించారన్నారు. నీటి పంపకం విషయంలో జరిగిన సమావేశాల్లో కూడా తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించేవారని సీఎం అన్నారు.
ఆయనకున్న అపారమైన అనుభవం, సాధికారత వల్ల ఎదుటివారు ఎదురు చెప్పడానికి కూడా సాహసించేవారు కాదన్నారు. విద్యాసాగర్ రావు మరణం వల్ల తెలంగాణకు తీరని నష్ట్రం కలిగిందన్నారు. విద్యాసాగర్ రావు అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర్రంలో ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. అయితే ఏ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలో నిర్ణయించి ప్రతిపాదనలు పంపాలని నీటిపారుదల శాఖను సీఎం ఆదేశించారు.