ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతి పెరుగుతూనే ఉన్నది. లక్షల క్యూసెక్కుల జలాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్ మేడిగడ్డ నుండి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరి నది ని చూడడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ, గోలివాడ పంప్ హౌజ్, ధర్మపురి పుణ్యక్షేత్రాలను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. అధికారులు ఇంజనీర్లతో పాటు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఈ పర్యటన ప్రారంభిస్తారు
10.50 గంటలకు మేడిగడ్డ బరాజ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యా హ్నం 12.30 గంటలకు గోలివాడ పంప్‌హౌస్‌కు చేరుకుంటారు. ఎల్లంపల్లి బరాజ్‌ను సందర్శించిన అనంతరం గోలివాడ పంప్‌హౌస్ వద్ద మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 2.15 గంటలకు ధర్మపురికి వస్తారు. ధర్మపురిలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.
ప్రాణహిత నుంచి లక్షల క్యూసెక్కుల వరద గోదావరిలోకి వచ్చి చేరుతున్నది. సోమవారం కాళేశ్వరం దగ్గర ఆరు లక్షలకు పైగా, మేడిగడ్డకు దిగువన పేరూరు వద్ద ఏకంగా 9.18 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం నమోదవుతున్నది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది. ఎల్లంపల్లి జలాశయం 485.01 అడుగుల నీటిమట్టంతో 19.70 టీఎంసీల నిల్వకు చేరింది. ఇక్కడినుంచి విడుదలచేసిన జలాలు సుందిల్ల బరాజ్‌కు చేరుకొంటున్నాయి. సుందిల్లలో ప్రస్తుతం 6.5 టీఎంసీల నీటినిల్వ ఉన్నది.