కాళేశ్వరంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు..

344
cm kcr santhosh
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్. ఆలయ అధికారులు సీఎంకు ఘనస్వాగతం పలకగా స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.అంతకముందు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌ నుండి హెలికాప్టర్ ద్వారా కన్నెపల్లి పంపుహౌజ్ వద్దకు చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాళేశ్వరం  చేరుకుని ఆలయాన్ని సందర్శించారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ,ఎంపీ సంతోష్ కుమార్,టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

ఇక్కడి నుండి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండే సీఎం కేసీఆర్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. గేట్ల బిగింపు, కరకట్టల నిర్మాణం, రివీట్‌మెంటు పనుల పురోగతిపై ఇంజినీర్లతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ వానాకాలం నుంచే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీరందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి.

నక్సల్స్ కోటలో కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. కన్నెపల్లి, మేడిగడ్డ ప్రాంతాల్లో ఆర్మ్‌డ్ రిజర్వు సివిల్, స్పెషల్ బలగాలతో భద్రత చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాంబుస్కాడ్ బృందాలు, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలను కూడా ముమ్మరం చేశారు. సీఎం వచ్చి తిరిగి వెళ్లేంత వరకు భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈప్రాజెక్ట్ పనులను సీఎం కేసీఆర్ ఇప్పటికే మూడుసార్లు పరిశీలించారు.

- Advertisement -