సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో సింగరేణిలో గుర్తింపు సంఘాలుగా పనిచేసిన యూనియన్లు కార్మికులకు చేసిందేమి లేదని అన్నారు. జాతీయ కార్మిక సంఘాల సాక్షిగానే సింగరేణిలో కార్మికుల హక్కులు పోయాయని, ఆ జాతీయ సంఘాల సంతకాలతోనే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోయాయని, సమస్యలను అర్ధం చేసుకోవడంలో గత సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు.
సింగరేణిలో పని చేస్తున్న కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని, సింగరేణిలో జరిగిన విధ్వంసం కార్మికులకు తెలుసని, రిటైర్డ్ తర్వాత సింగరేణి కార్మికులు పదేళ్లకు మించి బతకరని , అంత దుర్భరంగా వారి జీవితాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కార్మికులకు వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఎవరూ పట్టించుకోలేదు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే కోర్టు స్టేలు తెచ్చి వాటిని అడ్డుకున్నారని, ప్రతిదానికి ముఠాలు తయారయ్యాయని, వారసత్వ ఉద్యోగాలు రాకుండా 17 కేసులు వేశారని సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వారసత్వ ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశముందని, కార్మికులు ఏమాత్రం భయపడాల్సిన పని లేదని కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.