తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22 నుండి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 22న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టనుంది. 23న బడ్జెట్‌పై చర్చ జరగనుండగా 25న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది.
అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు కావడంతో బడ్జెట్ ఎవరు ప్రవేశ పెడతారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సారి బడ్జెట్‌ను సీఎం కేసీఆరే ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం, ఆర్థిక శాఖ సీఎం వద్దే ఉండడంతో ఆయనే బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్నాయి. బడ్జెట్ పుస్తకాల్లో సైతం కేసీఆర్ పేరును ప్రచురించనున్నట్లు తెలుస్తోంది.
సాధారంగా ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే, ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోం మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక శాఖ సహా మిగతా శాఖలన్నీ కేసీఆర్ వద్దే ఉన్నాయి. దీంతో శాసనసభలో ముఖ్యమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. శాసన మండలిలో మహమూద్ అలీ ప్రవేశపెడతారు.
ముఖ్యమంత్రులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆనవాయితీ గతంలోనూ ఉంది. సీఎంగా ఉంటూనే ఆర్థిక శాఖ మంత్రిగా కె.రోశయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించవచ్చని భావిస్తున్నారు.