కేంద్రం తీసుకురాబోతున్న విద్యుత్ చట్టంలో అనేక లోపాలున్నాయని తెలిపారు సీఎం కేసీఆర్. ఈ బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. విద్యుత్ సవరణ బిల్లుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం….ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలనే దృక్పథం బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు లేకుండా పోయిందన్నారు.
దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉన్నా చెన్నైలో తాగునీటికి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. నీరు పుష్కలంగా ఉన్న తాగు, సాగు నీరు ఇవ్వలేకపోతున్నామన్నారు. దేశ ప్రగతి కోసం మిగులు విద్యుత్‌ను వినియోగంలోకి తేవాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు.కొత్త చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు మీటర్లు పెట్టాల్సి వస్తుందని….కొత్త మీటర్ల కోసం రూ. 700 కోట్లు కావాలన్నారు. మీటర్ రీడింగ్ తీస్తారు.. బిల్లులు ముక్కు పిండి వసూలు చేస్తారని రాష్ర్టంలోని 26 లక్షల బోర్లకు మీటర్లు పెట్టేందుకు రాష్ర్ట బీజేపీ నేతలు ఒప్పుకుంటారా? అని సీఎం ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని పరిపాలించే విధానంలో.. అంబేడ్కర్, ఇతర గొప్ప వ్యక్తులు ప్రవేశపెట్టిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా రాష్ర్టాల హక్కులను హరిస్తున్నారని దుయ్యబట్టారు.