ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించుకున్నందుకు ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ప్రజలను అభినందిస్తున్నాను అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్ల కంటే మన కలెక్టరేట్లు బాగున్నయ్. ఎనిమిదేళ్ల వెనక్కి తిరిగి చూస్తే పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా. బొంబాయి బస్సుల జిల్లా. ఖిలాఘనపురం వెళ్లే బొంబాయి బస్సులు కనపడేవి. ఈ రోజు వనపర్తి జిల్లా కావడమే కాదు ఇంత అద్భుతమైన కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. వనపర్తి పట్టణంలో గజిబిజి గందరగోళం ఉండేది గతంలో.. పట్టణంలోని రోడ్ల వెంట ప్రయాణిస్తూ వచ్చాను. చక్కటి రోడ్లు నిర్మాణమవుతున్నాయి. మిగతా వాటిని పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించాను. కరువు మాయమై పంటలు పండుతున్నయ్. అద్భుతమైన ఒక రూపం వచ్చిందన్నారు.
నిన్న తెలంగాణ ఎకనామిక్ సర్వే అసెంబ్లీలో పెట్టాం. అనేక రంగాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందని.. ఒకప్పుడు కరెంటు రాదు.. ఎప్పుడు వస్తదో తెలియదు.. ఇవాళ తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానం. రాష్ట్ర ఆర్థిక వనరులకు సంబంధించిన విషయంలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నది. ప్రతి ఇంటికి నల్లాపెట్టి నీరిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. తలసరి ఆదాయం పెరగడం, విద్యుత్, వనరులు పెరుగడం.. గాల్లేకేలి రాదు.. మాయ మశ్చింద్ర చేస్తే రాదు. అధికారులు, ప్రజాప్రతినిధులంతా కష్టపడ్డరు. తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేయాలనే యజ్ఞంలో భాగస్వాములయ్యారు కాబట్టి ఇవాళ రాష్ట్రమంతా కలిపి ప్రగతిపథంలో ముందుకు వెళ్తున్నది అని సీఎం అన్నారు.