కేంద్ర ప్రభుత్వ తీరుపై అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగ స్పూర్తిని కాలరాస్తూ రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ విద్యుత్ సంస్కరణలపై లఘు చర్చ జరుగగా దీనిపై మాట్లాడిన సీఎం…బీజేపీ సర్కార్ చెప్పేదొకటి చేసేది మరొక్కటన్నారు. అధికారం అనేది బాధ్యత రాచరికం కాదని చురకలంటించారు. లెక్కలతో సహా తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల్లో ఎక్కడా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వొద్దని చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం…రఘునందన్‌రావు సభను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మొదటి కేబినెట్‌లో కేంద్రం తెలంగాణ గొంతు నులిమేసే విధంగా.. అందులో మరీ ముఖ్యంగా 460 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు సీలేరును ఆంధ్రాకు కేటాయించిందని విమర్శించారు.
రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చడమే పనిగా బీజేపీ పెట్టుకుందని దుయ్యబట్టారు. ఇక్కడున్న ముగ్గురు ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని వ్యాఖ్యానించడం దేనికి నిదర్శనమన్నారు. రాజ్యాంగంలో కేంద్రం పరిధిలో, రాష్ట్రాల పరిధిలో ఉండాలి.. ఇద్దరు కలిసి సంప్రదించుకొని చేసుకునేందుకు కొన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు. ఈ పవర్ ఉమ్మడి జాబితాలో ఉన్నది. దీనిపై కేంద్రం పెత్తనం లేదన్నారు.
ప్రతిపక్ష సభ్యుడు లేస్తే వందమంది అధికార పార్టీ సభ్యులు లేచి రకరకాల పేర్లు పెట్టి అరవడం. వారి నోళ్లను మూయించడం.. గందరగోళం సృష్టించి ఆ బిల్లులను పాస్ చేసుకుంటూ ఇలాంటి చట్టాలు చేస్తున్నరని కేంద్రం తీరును తప్పుబట్టారు.