సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ.. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందన్నారు. ఇది మామూలు పేట కాదని, సిద్ధి పొందినటువంటి పేట అని వ్యాఖ్యానించారు. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ సిద్ధిపేట అని అన్నారు. అంతేకాదు.. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు అని వ్యాఖ్యానించారు. అవసరం రీత్యా కరీంనగర్ ఎంపీగా, సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రెండు చోట్లా గెలిచానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
‘తెలంగాణ కోసం ఢిల్లీ పోవాల్సిన అవసరం ఏర్పడడం.. రాజీనామా చేసి ఢిల్లీకి పోతున్నాను అని చెబితే.. అందరం కలిసి గంట సేపు అక్కడ హాల్‌లో ఏడ్చాం.’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణనే కాదు మన సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని చెప్పి మంచి ఆణిముత్యం లాంటి నాయకుడిని హరీశ్‌రావు మీకు అప్పగించా. నా పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేట తయారు చేశాడు. ఇది తన గుండెల నిండా సంతోషం నింపే అంశమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హరీష్ రావు మంచి హుషారుమీదున్నాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పోతే చాలు అన్నాడు. ఇక్కడికి వచ్చాక ప్రజల ముందు నన్ను నిలబెట్టి సిద్దిపేటకు ఇంకా ఏం కావాలో అన్నీ అడిగేశాడు.’ అంటూ చమత్కరించారు కేసీఆర్.