CM KCR:కామారెడ్డి రూపురేఖలు మారుస్తా

38
- Advertisement -

రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్ సర్కార్ రావాలన్నారు సీఎం కేసీఆర్. కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…ఈ గడ్డతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. నాడు తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది కామారెడ్డి అన్నారు.గత పోసానిపల్లె ప్రస్తుత కొనాయిపల్లె మా ఊరు అన్నారు. కామారెడ్డిని జిల్లా చేస్తామని చెప్పామని ఆ మాట నెరవేర్చుకున్నామన్నారు. కామారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. తనను కామారెడ్డి నుండి పోటీ చేయాలని ఎమ్మెల్యే గోవర్ధన్ పదేపదే కోరారని ఆ కోరిక నెరవేరిందన్నారు.

కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని అందుకే తాను ఒక్కడినే కామారెడ్డికి రాలేదన్నారు. కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డికి నీళ్లు కూడా వస్తాయన్నారు. కేసీఆర్ కామారెడ్డికి వస్తే విద్యాసంస్థలు, పరిశ్రమలు వస్తాయన్నారు. చాలా అందమైన నియోజకవర్గంగా కామారెడ్డి రూపురేఖలు మారుస్తానని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న రాజకీయాల్లో రావాల్సిన పరిణతి రాలేదన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి..కానీ అంతిమంగా గెలవాల్సింది ప్రజలే అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులతో పాటు ఆ వ్యక్తి వెనకున్న పార్టీ గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ పార్టీల పట్ల ప్రజలకున్న విధానాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. అందుకే ఓటును తమాషా కోసం వేస్తే అరిగోస పడతామన్నారు. ఎవరో చెప్పిండ్రని ఓటు వేయవద్దని విచక్షణతో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. బీఅర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడీ కార్మికులకు పింఛన్ ఇస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ ఆగం అయిందన్నారు. నాడు బొంబాయి, దుబాయ్ బతుకులు కానీ నేడు స్వరాష్ట్రంలో సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారన్నారు. 24 గంటల కరెంట్ వెలుగులతో తెలంగాణ విరాజిల్లుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో బిడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం లేదని ఒక్క తెలంగాణలో మాత్రమే ఇస్తుందన్నారు. రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్ సర్కార్ రావాలన్నారు. రైతు బంధును రూ. 16 వేలకు పెంచుకోబోతున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చాక గ్రామాల రూపు రేఖలు మారాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గంలోనూ 24 గంటల కరెంట్ లేదన్నారు.

రైతుల మోటార్లకు మీటర్ పెట్టాలని నరేంద్ర మోడీ చెప్పారని కానీ పెట్టనని తేల్చిచెప్పానన్నారు సీఎం కేసీఆర్. మోటార్లకు మీటర్లు పెట్టనందుకు రూ.25 వేల కోట్ల కోత పెట్టారన్నారు. బీజేపీ నేతలు ఏం మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారన్నారు. ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని …ఆయనకు తెలంగాణపై పగ అన్నారు. అందుకే బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయవద్దన్నారు.ధరణి పోర్టల్ తో రైతుల భూములకు రక్షణ కల్పించామన్నారు.

Also Read:ఎన్నికల ప్రచారం..మంత్రి కేటీఆర్‌కు స్వల్ప గాయాలు

- Advertisement -