బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే పెన్షన్ 5 వేలు చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. చేర్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థినే కాదు పార్టీని చూసి ఓటు వేయాలన్నారు. ఎన్నికలు వచ్చిందంటే చాలు పచ్చి అబద్దాలు మాట్లాడటం పరిపాటిగా మారిపోయిందన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని..ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలన్నారు.ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటు అని దానిని మంచిచేసే పార్టీకే వేయాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు. గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ల ముందే ఉందన్నారు. కాంగ్రెస్ 50 సంవత్సరాల పాలనలో చేసిందేమి లేదన్నారు. ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలి అని నినదిస్తే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ఇచ్చారన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లుగా అధికారంలో ఉన్నామని…అంతకముందు ఎలా ఉండేది…ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. నాడు వలసలతో అల్లాడిన జనగామ ప్రాంతం నేడు అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు. తెలంగాణను నెంబర్ 1 చేసింది ఎవరు..24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు ఆలోచించాలన్నారు.ఆంధ్రోల్ల బూట్లు మోసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. కుక్కలు చాలా మొరుగుతాయని వాటిని పట్టించుకోవద్దన్నారు. తెలంగాణను పీడించిన పార్టే కాంగ్రెస్ అన్నారు. అన్నం పెట్టే రైతును పురుగుల మందు తాగేలా చేసిన పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఎంత…ఇప్పుడు ఎంతుందో ఆలోచించాలన్నారు. వెయ్యి రూపాయలతో ప్రారంభించి దానిని 2 వేలకు తీసుకుపోయామన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే దానిని 5 వేలకు తీసుకుపోతామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 2 వేలు ఉంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు కేసీఆర్. కానీ ఇక్కడ నాలుగు వేలు ఇస్తామని మాట్లాడుతున్నారని వారిని నమ్మితే మోసపోతామన్నారు. కళ్యాణ లక్ష్మీ, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఎక్కడైనా ఉన్నాయా ఆలోచించాలన్నారు. రైతు బంధు, రైతు భీమా, పంటలకు మద్దతు ధర ఇస్తున్న ఏకైక సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ అన్నారు. దేశంలో రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ అన్నారు. రైతుల పరిస్థితి ఇప్పుడిప్పుడే బాగు పడుతుందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిస్తే రైతు బంధు రూ.16 వేలు అవుతుందన్నారు.పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే 3 గంటల కరెంటే వస్తుంది…పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిస్తే 24 గంటల కరెంట్ వస్తుందన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళఖాతంలో కలుపుతామని అంటున్నారని వారినే బంగాళాఖాతంలో కలపాలన్నారు.
Also Read:Nani:రాజకీయ నాయకుడిగా ప్రముఖ హీరో