రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలుండగా దళితబంధు కోసం ఒక్కో మండలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. మున్సిపాలిటీల నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు. ఇక దళిత బంధు కోసం రూ. 500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దళితబంధు పథకంపై ట్వీట్ చేశారు కేటీఆర్. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 20వ శతాబ్దంలో సామాజిక న్యాయం ద్వారా దళితులకు విముక్తి కలిగిస్తే.. 21వ శతాబ్దంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థిక సాధికారతతో వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. దళితుల ఆర్థిక స్వాలంబన కోసం మరో గొప్ప కార్యక్రమం దళిత బంధు ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.