రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేతర ప్రభుత్వమే అన్నారు సీఎం కేసీఆర్. నిజామాబాద్‌లో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, అనంతరం జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడిన సీఎం..2024 ఎన్నికల్లో ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే అని తేల్చిచెప్పారు. 2024లో బీజేపీ ముఖ్త్ భారత్ నినాదంతో రైతాంగం నడవాలని చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అలా చేస్తే దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని అన్నారు.
ఎన్పీఏల పేరుతో వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టిందని, రైతులకు మాత్రం ఉచితాలు ఇవ్వద్దని ప్రధాని మోదీ అంటున్నారని చెప్పారు. భారత్ మొత్తం ఆశ్చర్యపోయేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఎక్కడా ఇవ్వడం లేదని తెలిపారు. కేంద్ర సర్కారు రైతుల మోటార్ల లెక్కలు తీయమంటోందని ఆ…రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నరేంద్ర మోదీ చెబుతున్నారని విమర్శించారు. ఈ కరెంట్ మీటర్లు పెట్టుడు వెనుక పెద్ద కుట్రే ఉందంటూ వ్యాఖ్యానించారు.