సిద్దిపేటలో సీఎం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవే..

164
kcr
- Advertisement -

సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఈటల రాజేందర్, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జె. సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

– రూ. 45 కోట్ల వ్యయంతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 ఎకరాల స్థలంలో దుద్దెడ వద్ద నిర్మించబోయే ఐటి టవర్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమెరికాలోని నాలుగు ఐటి కంపెనీలు సిద్దిపేట ఐటి టవర్ నుండి కార్యకలాపాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఒప్పందం చేసుకున్నాయి.

– సిద్దిపేట సమీపంలోని మిట్టపల్లిలో రూ. 22 లక్షల వ్యయంతో 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

– రూ. 715 కోట్ల వ్యయంతో దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు.

– వెయ్యి పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

– సిద్దిపేట పట్టణంలో 45 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 145 కోట్ల వ్యయంతో నిర్మించిన 2,460 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. పోత దేవేందర్- స్వాతి, రాజ్ కౌర్, మహ్మద్ సద్దాం, యాక భాగ్య లతో మొదట గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా సర్వమత పెద్దలు సర్వమత ప్రార్థనలు జరిపారు. కెసిఆర్ నగర్ గా నామకరణం చేసిన ఈ గృహ సముదాయంలో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను, సమీకృత మార్కెట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

– సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛ సిద్దిపేటగా మార్చేందుకు రూ. 278.50 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు.

– 3.50 టిఎంసి ల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఉన్న పల్లగుట్ట ద్వీపం లో నిర్మించిన నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువులో జరిగిన సుందరీకరణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. నెక్లెస్ రోడ్ వెంట కాలినడకన ముఖ్యమంత్రి తిరుగుతూ పరిశీలించారు. కోమటి చెరువులో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ పై కెసిఆర్ నడిచారు. కోమటి చెరువు ప్రాంతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని మంత్రి హరీశ్ రావును కెసిఆర్ అభినందించారు.

- Advertisement -