ఇన్‌స్టంట్‌ రిజిస్ట్రేషన్‌.. ఇన్‌స్టంట్‌ మ్యుటేషన్‌: కేసీఆర్‌

282
kcr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బుధవారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై నేడు అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ బిల్లుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సవివరంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అమలు చేసిన రెవెన్యూ విధానం ఎంతో అశాస్త్రీయమైనదే కాకుండా, దురదృష్టకరమైనదని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇకపై ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ ప్రక్రియ కూడా జరుగనుందన్నారు. అసెంబ్లీలో ఈ ప్రక్రియ గురించి సీఎం వివరించారు.

ఉదాహరణకు నేను, మహమూద్‌అలీ ఉన్నం. నాకో పదెకరాలు ఉన్నది. రెండెకరాలు మహమూద్‌ అలీకి అమ్ముతున్న. మేం ముందుగా రిజిస్ట్రేషన్‌ కోసం ఎమ్మార్వో దగ్గర సమయం తీసుకుంటం. అక్కడ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మమ్మల్ని ‘మీకు డబ్బులు ముట్టినయా? డాక్యుమెంట్లు సిద్ధమైనయా?’ అని అడుగుతరు. మేం అప్పటికి అన్నీ సిద్ధంగా ఉంచుకుంటం. వాటిని కంప్యూటర్‌లో చూసి పరిశీలిస్తరు. వీటిని రిజిస్ట్రేషన్‌ చేయవచ్చా? లేదా అన్‌లాక్‌లో ఉందా? అని చూస్తరు. ఫీజును చలానా రూపంలోగానీ నగదు రూపంలోగానీ తీసుకొని వెంటనే రిజిస్ట్రేషన్‌ చేస్తరు. నేను రెండెకరాలు అమ్మినందున వెంటనే నా పాస్‌పుస్తకంలో ఆ రెండెకరాల్ని తొలిగిస్తరు (డిలీట్‌ చేస్తరు). ఇయ్యాల బ్యాంకుకుపోతే ఆటోమెటిక్‌గా ఎలా పాస్‌పుస్తకాలపై వివరాలిస్తున్నరో అట్లనే ఇక్కడ కూడా వెనువెంటనే నా పాస్‌పుస్తకంలో రెండెకరాలు డిలీట్‌ చేసి మహమూద్‌ అలీ పాస్‌పుస్తకంలో ఎక్కిస్తరు.

మ్యుటేషన్‌ అధికారాలు ఆర్డీవోలకు తొలిగించి, ఎమ్మార్వోలకు ఇస్తున్నం. ఆ తర్వాత వెంటనే మ్యుటేషన్‌ ఫారాల మీద కూడా సంతకాలు తీసుకొని మ్యుటేషన్‌ చేస్తరు. దీని తర్వాత అక్కడే సిద్ధంగా ఉన్న ఐటీ టేబుల్‌ (టీఎస్‌ టెక్నాలజీ ఆధ్వరంలోనిది) మీద ఉన్న వ్యక్తి వెంటనే దానిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌చేస్తరు. ఇద్దరం అక్కడ ఉండగానే అప్‌లోడ్‌ చేసి ఆ కాపీని కూడా మాకిస్తరు. ఇట్ల నిమిషాల వ్యవధిలోనే ఇదంతా యావత్‌ ప్రపంచానికి తెలిసిపోతది. ఫలానా వాళ్లు భూమి అమ్మినరు, ఫలానా వాళ్లు భూమి కొన్నరు, మ్యుటేషన్‌ అయిపోయిందని తెలుస్తది. వెంటనే కొన్నవాళ్లకు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, పాస్‌ పుస్తకం, ఎక్స్‌ట్రాక్ట్‌ కాపీ ఇస్తరు. అమ్మినవాళ్లకు పాస్‌పుస్తకం, ధరణి కాపీ ఇస్తరు. ఇక దరఖాస్తు లేదు.. దఫ్తరు లేదు.. రశీదు లేదు.. ఎక్కడికి పోయే అవసరం లేదు. సంతోషంగా ఎవరింటికి వాళ్లు పోవచ్చు. ఇదంతా చాలా బ్రహ్మాండంగా ఉంటది. అనేకమంది నిపుణులు, ఐటీ వాళ్లతో మాట్లాడినం. చాలా బాగుంది. ప్రపంచంలో ఎక్కడా లేదు, మంచి సాఫ్ట్‌వేర్‌ ఉన్నదని చెప్పినరని సీఎం వివరించారు.

- Advertisement -