ఉద్యానవన శాఖ బలోపేతం కావాలి: సీఎం కేసీఆర్

112
cm kcr

కూరగాయలు, పండ్లు, పూలు తదితర తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని, ఇందుకోసం ఉద్యానవన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారన్నారు. ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సిఎం పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఉద్యానవన శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సిఎం హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలని, ఏడాదిలోగా ఫలితాలు సాధించాలని సిఎం చెప్పారు. వివిధ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచినట్లు ఉద్యానవన పంటల సాగులో కూడా అగ్రస్థానం సంపాదించాలన్నారు. భవిష్యత్తుకు బాటలు వేసుకునే దశలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల విషయంలో కూడా సమగ్ర దృక్పథం ఏర్పరచరుకోవాలని ఆకాంక్షించారు.

ప్రగతి భవన్ లో బుధవారం ఉద్యానవన శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, ఉద్యానవన శాఖ ఎండి వెంకట్రాంరెడ్డి, జెడి సరోజన, డిడి సునంద, సీనియర్ అధికారులు సత్తార్, బాబు, భాగ్యలక్ష్మి, మధుసూదన్, లహరి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.‘‘తెలంగాణ రాష్ట్రంలో విభిన్న రకాల స్వభావాలు కలిగిన నేలలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 900-1500 మిల్లీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం ఉంది. వృత్తి నైపుణ్యం కలిగిన లక్షలాది రైతు కుటుంబాలున్నాయి. ఇవన్నీ తోటల సాగుకు ఎంతో సానుకూలం. ఇంత ఉండి కూడా ఇంకా వేరే రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు,మసాల దినుసులు, నూనె గింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి మారాలి. ఉద్యానవన పంటల్లో తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలి. మన అవసరాలు తీర్చడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసే విధంగా మనం ఎదగాలి. ఇందుకోసం ఉద్యానవన శాఖ సమాయత్తం కావాలి. రైతులను చైతన్య పరచాలి. ఏ ప్రాంతంలో ఎలాంటి ఉద్యానవన పంటలు సాగు చేయగలుగుతామో నిర్ణయించి, రైతులకు అవగాహన కలిగించాలి. ఉద్యాన వన పంటల సాగులో అద్భుత ప్రగతి సాధించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

పండ్లు, కూరగాయలు, పూలు, నూనె గింజలు, మసాలా దినుసులు తదితర ఉద్యాన పంటల సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ఉద్యానవన శాఖ పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలి. ఉద్యానవన విద్య, విస్తరణ, పరిశోధన పెంపొందాలి. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా లాంటి రాష్ట్రాల్లో, నెదర్లాండ్ లాంటి దేశాల్లో ఉద్యానవన పంటలు అద్భుతంగా పండిస్తున్నారు. అక్కడికి వెళ్ళి సాగు పద్ధతులు, అనుభవాలు, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి. మంచి విధానాలను మనం అనుసరించాలి. తెలంగాణకు చెందిన ఉద్యానవన శాఖ అధికారులను బెంగులూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ కు పంపి శిక్షణ ఇప్పించాలి. అక్కడి నుంచి నిపుణులను తెలంగాణకు ఆహ్వానించి, ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలి. హార్టికల్చర్ యూనివర్సిటీలో, ఉద్యానవన శాఖలో తోటలపై పరిశోధనలు విస్తృతంగా జరపాలి. ఉద్యానవన పంటల సాగులో వస్తున్న ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ పై ఎప్పటికప్పుడు అధ్యయనం జరగాలి. ఈ శిక్షణ, అధ్యయనం ప్రక్రియ నిరంతరాయంగా సాగాలి. ఉద్యానవన తోటల సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగులో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి సమగ్ర ఉద్యానవన పంటల విధానం తయారు చేయాలి. వేరే ప్రాంతాల్లో పర్యటించి, తెలంగాణకు అనుగుణమైన విధానాన్ని మూడు నెలల్లో రూపొందించాలి. ఏడాదిలోగా ఉద్యాన పంటల సాగులో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి దిశా నిర్ధేశం చేశారు.‘‘ఉద్యానవన శాఖను విస్తరించాల్సిన అవసరం ఉంది. మండలానికి ఒక ఉద్యానవన శాఖ అధికారిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ఉద్యానవన శాఖలో కూడా సాగు విధానంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడానికి, మార్కెటింగ్ పై నిరంతరం సమాచారం తెలుసుకోవడానికి, పంటల్లో నాణ్యత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి సీనియర్ అధికారుల నాయకత్వంలో ప్రత్యేక విభాగాలు ఉండాలి. ఉద్యానవన శాఖకు ఇంకా ఎంత మంది ఉద్యోగులు కావాలి? శాఖను ఎలా విస్తరించాలి? అనే అంశాలపై వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలి. అవసరమైన అధికారులను, సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న అన్ని రైతు వేదికల్లో ఉద్యానవన శాఖ అధికారులు కూడా కూర్చుని రైతులతో మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తాం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉద్యానవన పంటలను పెద్ద ఎత్తున సాగు చేయడంతో పాటు అవసరమైన మార్కెటింగ్ విషయంలో కూడా దృష్టి పెట్టాలి. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏది అవసరమో గుర్తించి, వాటిని రైతులతో సాగు చేయించాలి. ఢిల్లీ ఆజాద్ పూర్ మార్కెట్ తరహాలో హైదరాబాద్ కొంగరకలాన్ ప్రాంతంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటల మార్కెట్ ను నెలకొల్పుతాం’’ అని సిఎం వెల్లడించారు.