ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా కలుపుకుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని సిఎం అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్సీలు మురళీధర్ రావు, హరేరామ్, సిఇలు వెంకట కృష్ణ, శంకర్ నాయక్, మధు సూదన్ రావు, ఎస్.ఇ. శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
‘‘అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది. దుమ్ముగూడెం పాయింట్ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది. ఈ నీటి ద్వారా ఖమ్మం జిల్లా యావత్తు నీరు అందించవచ్చు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి, అటు ఇల్లందు వైపు, ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్ కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలి. సత్తుపల్లి, ఇల్లందు వైపు వెళ్లే కాలువలకు సంబంధించిన మిగిలిన పనుల సర్వే వెంటనే పూర్తి చేసి, టెండర్లు పిలవాలి. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి, పాలేరు రిజర్వాయర్ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్ కల్లా పూర్తి చేయాలి. కృష్ణా నదిలో నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో తెలియదు. అంతా అనిశ్చితి ఉంటుంది. కృష్ణా నది ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్ ఆయకట్టుకు నీరందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి’’ అని సిఎం చెప్పారు.