దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ పల్లెలు- పట్టణాలు: సీఎం

90
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు, వరి ధాన్యం సేకరణ మరియు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

విధ్వంసం అనంతరం వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం చాలా కష్టమైన పని. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగుచేసుకోవడానికి మనం చాలా కష్టపడాల్సివస్తున్నది. కష్టాలను అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని సీఎం అన్నారు.

తెలంగాణ నూతన పంచాయతీ రాజ్ చట్టం తెచ్చినప్పుడు పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కాని నేడు వారి అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నాం. ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయి. మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.

రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ఈ దిశగా కృషి చేసిన పంచాయతీ రాజ్ శాఖను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం అభినందించారు.

- Advertisement -