19 జిల్లాల్లో ప్రభుత్వ డయాగ్నోసిస్ కేంద్రాలు- సీఎం కేసీఆర్

158
cm kcr
- Advertisement -

రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని, ఈమేరకు ఇవాళ వైద్య అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో సీఎం చర్చించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయనే విషయాన్ని, వైద్యాధికారులు తన దృష్టికి తెచ్చిన నేపథ్యంలో, వాటిని సోమవారం నుంచి ప్రారంభించాలని సీఎం వైద్యాధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామన్నారు. ప్రజలకు ఉచిత వైద్యకోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. గత పాలనలో ఆగమైన వైద్య రంగాన్ని అనతికాలంలోనే ప్రభుత్వం పునరుజ్జీవింప చేసిందన్నారు. సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేస్తున్నదన్నారు. వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోసిస్) కేంద్రాలను తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని తెలిపారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధంగా వున్న 19 కేంద్రాల్లోని డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని సీఎం తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకుందానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. రోగం కంటే రోగ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువయింది. రోగ నిర్ధారణ జరగాలంటే రక్తం మూత్రం వంటి పరీక్షలు జరపాల్సిందే. ఈ నడుమ ప్రతి మనిషికి బీపీలు, షుగర్లు ఎక్కువయినయి. వాటి పరీక్ష చేయించుకోవాలి. గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సరు, థైరాయిడ్ తదితర జబ్బులకు సంబంధించిన పరీక్షలు నిత్యం సామాన్యులకూ పేదలకు అవసరంగా మారినయి. ఈ మధ్యకాలంలో కరోనా వ్యాధి ఒకటి కొత్తగా జబ్బుల లిస్టులో వచ్చి చేరింది. దానికీ పలు రకాల పరీక్షలు వున్నయి. ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తడు కానీ పరీక్ష కోసం ఎక్కడికో ప్రయివేట్ సెంటర్లకు పోయి వేలకు వేలు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తున్నది. దీనివల్ల పేదలకు విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నది. కరోనా నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఇంకా కరోనా చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షల కోసం కూడా పేదలు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో.. వైద్యాన్ని అందిచడమంటే కేవలం డాక్టర్లు మందులు సూదులు మాత్రమే కాదనీ, పరీక్షలు కూడా అత్యంత ప్రధాన్యత అంశంగా ప్రభుత్వం భావించింది. ఈ మేరకు తక్షణం 19 జిల్లాల్లో డయాగ్నసిస్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నోసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం..’’ అని సీఎం తెలిపారు. ఇటువంటి ఏర్పాటు ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మకమైనదని, పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదనేదానికి నిదర్శనమని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. కరోనా వంటి ఆపత్కాలంలో ప్రభుత్వం వినియోగంలోకి తెస్తున్న డయాగ్నోసిస్ సేవలు ప్రజలకెంతో మేలు చేస్తాయన్నారు. ఈ పథకానికి త్వరలోనే మంచి పేరును పెడుతామని సీఎం తెలిపారు.

ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. అందులో కరోనా పరీక్షలతో పాటుగా రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ సుగర్ గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీ కి సంబంధించిన పలు పరీక్షలు వుంటాయని తెలిపారు. సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారని సీఎం తెలిపారు. నిర్ధారించిన రిపోర్టులను ఆయా రోగుల సెల్ ఫోన్లకు మెసీజీల రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసిందన్నారు. ఈ కేంద్రాల్లో పరీక్షలకోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పరీక్షా యంత్రాలన్నీ అత్యంత అధునిక సాంకేతికతతో, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో, ఖరీదైన యంత్రాలని సీఎం అన్నారు. ఇటువంటి పరీక్షా యంత్రాలు పెద్ద పెద్ద కార్పోరేట్ దవాఖానాల్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ దవాఖానాలల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఏర్పాటు చేసిందని సీఎం స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నసిస్ కేంద్రాల్లో ఫుల్లీ (fully) ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇమ్యునో అస్సే అనలైజర్, ఫైవ్ పార్ట్స్ సెల్ కౌంటర్, ఎలీసా రీడర్ అండ్ వాషర్, ఫుల్లీ ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్ వంటి అత్యాధునిక సాంకేతికతో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలున్నాయని వివరించారు. వీటితో పాటుగా ఈసీజీ, టుడీ ఈకో, ఆల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్ రే వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలను కూడా ఏర్పాటు చేసామన్నారు. ఇవి అత్యంత సామర్థ్యంతో కూడుకుని అత్యంత వేగంగా రిపోర్టులందిస్తాయన్నరు. పైన తెలిపిన పరీక్షల తీరును అనుసరించి ఒక్కో యంత్రం, గంటకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత ఖశ్చితత్వంతో అందచేస్తాయని తనకు వైద్యాధికారలు తెలిపారని సీఎం అన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది పేదలకు రోగ నిర్ధారణలు చేసి, వైద్య సేవలందించ గలుగుతామని సీఎం తెలిపారు. వీటితో పాటు, అందుబాటులో లేని చోట్ల సీటీ స్కానింగ్ యంత్రాలను కూడా దశల వారీగా ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మేరకు పాథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, రేడియాలజిస్టులు, సహా పరీక్షలను నిర్వహించేందుకు అర్హులైన ఇతర సాంకేతిక సిబ్బందిని కూడా ప్రభుత్వం అందుబాటులో వుంచిందని సీఎం తెలిపారు.

‘‘వైద్య అవసరాల కోసం నాలుగు రకాల ఖర్చులుంటయి. దవాఖానకు పోవడానికి రవాణా ఖర్చు, పోయినంక డాక్టర్ ఫీజు, మందులు, పరీక్షల ఖర్చు, ఇన్ పేషెంట్ గా షరీఖ కావాలంటే ట్రీట్మెంట్ ఖర్చు, రోగం నయమయినంక తిరిగి ఇంటికి పోవాలంటే మల్లా రవాణా ఖర్చు, ఒక వేల చనిపోతే వారి పార్థివ దేహాన్ని తరలించడానిక అదో ఖర్చు ఇన్ని తీర్ల ఖర్చులుంటయి’’ అని సీఎం వివరించారు. ఈ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వ దవాఖానాలలో పూర్తి ఉచితంగా సామాన్యులకు వైద్య సేవలందిస్తున్నదని సీఎం తెలిపారు. ఎమర్జెన్సీ సమయాల్లో దవాఖానకు తీసుకుపోవడానికి (108 నెంబర్ అంబులెన్సులు) 428 వాహనాలను నిరంతరం నడుపుతున్నదని తెలిపారు. బాలింతలు తల్లీ బిడ్డల రక్షణ రవాణా కోసం అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటికే 300 వాహనాలను ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తున్నదని అన్నారు. బాలింతలను దవాఖానాలో చేర్చడం నుంచి తిరిగి ప్రసవానంతరం తల్లీ బిడ్డలను ఇంటివద్దకు సురక్షితంగా చేర్చే వరకు అమ్మఒడి’ వాహనాలు అందుబాటులో ఉంటున్నాయన్నారు.

ఇప్పటికే అన్ని రకాలుగా వైద్య సేవలను అందిస్తున్న నేపథ్యంలో కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షల కోసం కూడా 19 కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో చికిత్స చేయించుకున్న రోగికి స్వయంగా ఈ డయాగ్నోసిస్ కేంద్రాలకు వెల్లలేని పరిస్థితులుంటాయని సీఎం అన్నారు. ఇటువంటి సందర్భంలో సంబంధిత వైద్యుని సిఫారసు మేరకు, రోగ నిర్ధారణ పరీక్షల కోసం పరీక్షా సాంపిల్ ను ప్రభుత్వమే దగ్గరలో వున్న కేంద్రానికి పంపి పరీక్షలు నిర్వహించి సత్వరమే రిపోర్టులు ఇచ్చే విధంగా, సోమవారం నుంచి ప్రారంభించనున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో, పేదల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని సీఎం అన్నారు.

- Advertisement -