కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష..

117
kcr cm
- Advertisement -

వరంగల్ పర్యటనలో భాగంగా ఎంజీఎం సందర్శన, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరంగల్ సెంట్రల్ జైలును నగర శివార్లకు తరలించి ఓపెన్ ఎయిర్ జైలుగా మారుస్తామని, అదే స్థలంలో సకల సౌకర్యాలతో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) నిర్మిస్తామని స్పష్టం చేశారు.

వరంగల్ ఎంజీఎం దవాఖానాను విస్త్రృత పరిచి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం ఇక్కడికి వచ్చే విధంగా సకల సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుకుందామన్నారు. అలాగే, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెంటనే పటిష్ట పరుచుకోవాలని సీఎం అన్నారు. ఇక్కడి నుంచి తరలించే సెంట్రల్ జైలు కోసం నగర శివార్లలో విశాలమైన ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ సెంట్రల్ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులాగా, ఖైదీల పరివర్తన కేంద్రంగా నిర్మించుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ దవాఖానాలో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు, కరోనా కట్టడి, ధాన్యం సేకరణ, లాక్ డౌన్ అమలు పై కూడా సీఎం కేసీఆర్ కూలంకంశంగా చర్చించారు.

ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, డాక్టర్ టి.రాజయ్య, సతీశ్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అర్బన్ రూరల్ జెడ్పీ చైర్మన్లు సుధీర్, గండ్ర జ్యోతి, జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -