రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది కోసం పూర్తి ప్రభుత్వ ఖర్చుతో ఎస్.కె. డే జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా సొమ్ము అందేలా పథకం ఉంటుందని వివరించారు. రైతుల కోసం అమలు చేస్తున్న రైతు బీమా మాదిరిగానే ఎస్.కె.డే బీమా కూడా ఉంటుందని వెల్లడించారు. భారతదేశంలో పంచాయతీ రాజ్ ఉద్యమానికి ఆద్యుడైన ఎస్.కె.డేకు నివాళిగా ఈ జీవిత బీమాకు ఆయన పేరు పెడుతున్నట్లు సిఎం చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతీ ఇంటిలో నరేగా నిధులతో సోక్ పిట్స్ నిర్మించాలని సిఎం ఆదేశించారు. దీనిని చాలా ముఖ్యమైనదిగా భావించాలన్నారు. సోక్ పిట్స్ వల్ల ఏ ఇంటిలోని వ్యర్థం, మురికినీరు అక్కడే అంతర్థానమై, గ్రామంలో దోమలు, ఈగలు వ్యాపించకుండా ఉంటాయన్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు తగ్గుతాయన్నారు. సిద్ధిపేట, పెద్దపల్లి జిల్లాలను ఆదర్శంగా తీసుకొని సోక్ పిట్స్ నిర్మించాలని కోరారు. సోక్ పిట్స్ నిర్మాణం కోసం అవసరమయ్యే నిధులను విడుదల చేయాలని కోరారు.
30 రోజుల ప్రణాళిక అమలు పై నిర్వహించిన సమావేశం పది గంటలు కొనసాగి, రాత్రి 9 గంటలకు ముగిసింది. భోజనానంతర సమావేశంలో ముఖ్యమంత్రి పలు విషయాలు ప్రకటించారు. ఇకపై పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతీ ఏటా మూడు సార్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు సిఎం చెప్పారు. ప్రతీ ఏడాది జూన్, సెప్టెంబర్, జనవరి మాసాల్లో పది రోజుల చొప్పున పల్లె ప్రగతి నిర్వహించాలన్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే 20 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని, దీని కోసం మార్గదర్శకాలు తయారు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
పచ్చదనం-పరిశుభ్రత పెంచే కార్యక్రమంలో భాగంగా తన ఇంటిని, పరిసరాలను పచ్చగా, శుభ్రంగా ఉంచుకునే వారి ఇండ్లకు ఉత్తమ గృహం అవార్డు ఇవ్వనున్నట్లు సిఎం ప్రకటించారు. గ్రామాల్లో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అమలు సాధ్యాసాధ్యాలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలోని కమిటీ పరిశీలించాలని సిఎం చెప్పారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత బిఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
30 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వేలాడే తీగలను సరిచేసినట్లే, గ్రామం అవతల, వ్యవసాయ భూముల్లో, రోడ్లపైన, రోడ్ల పక్కన వేలాడే తీగలను సరిచేసే కార్యక్రమం తీసుకోవాలని విద్యుత్ శాఖను సిఎం కోరారు. ప్రతీ గ్రామం యొక్క సరిహద్దులను నిర్ణయిస్తూ, గ్రామ కంఠాన్ని ఖరారు చేయాలని సిఎం ఆదేశించారు. గ్రామంలోని రహదారులను గ్రామ పంచాయతీ పేర రిజిష్టర్ చేయాన్నారు.
సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన మరిన్ని విషయాలు:
– ఈ ఏడాది 75 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. పౌర సరఫరాలశాఖ ద్వారా ధాన్యాన్ని సేకరించాలి. ఇందుకోసం అవసరమైనన్ని సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాడానికి కలెక్టర్లకు పూర్తి అధికారం ఉంది. అందరూ ఒకేసారి సరుకును మార్కెట్ కు తేకుండా, నియంత్రిత పద్ధతిలో సేకరణ జరగాలి.
– గ్రామకంఠంలోని ఆస్తులు, స్థలాలు, ఇళ్లు ఏదో ఒక పద్ధతి ప్రకారం రికార్డు కావాలి. ఏదో ఒక రకమైన టైటిల్ ఆస్తి స్వంతదారులకు ఉండాలి. దీనికి ఏం చేయాల్నో ఆలోచన జరగాలి. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలి. పంచాయతీరాజ్ కార్యదర్శి ఈ అధ్యయనం చేయాలి. మనం తీసుకున్న నిర్ణయం దేశానికే ఒక మోడల్ కావాలి.
– గ్రామాల్లో లే ఔట్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దాన్ని గురించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అధ్యక్షతన నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయాలి.
– గ్రామాల్లోగానీ, పట్టణాల్లోగానీ ఇళ్ల మీద నుంచి పోతున్న కరెంటు వైర్లు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో గుర్తించాలని ఆదేశించారు.
– ఆ వైర్లను ఎలా తొలగించాలి? దానికి అయ్యే వ్యయం ఎంత? అనే నివేదిక తయారు చేయాలి. తుప్పుపట్టిన కరెంటు స్థంభాలను మార్చి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కరెంటు వైరింగ్ సమస్యలను పరిష్కరించాలి.
– రాష్ట్రంలోని మొత్తం లంబాడీ తండాల్లో అటవీ భూముల్లో ఎన్ని, అటవీయేతర భూముల్లో ఎన్ని ఉన్నాయో గుర్తించాలి. ఉన్న తండాలు, గోండు గూడేలు, కోయ గూడేలు, స్వంత జాగాల్లో ఎన్ని ఉన్నాయో కలెక్టర్లు లెక్కలు తీయాలి.
-గ్రామపంచాయతీలో నిర్ణయాలు, నిధుల వినియోగం ఏకస్వామ్యంగా ఉండకూడదు. గ్రామపంచాయతీలో సమిష్టిగా నిర్ణయాలు జరగాలి.
-గ్రామాల్లో ఏర్పాటు చేసే డంప్ యార్డుల పై షెడ్లు ఏర్పాటు చేయాలి. షెడ్లు లేకుంటే వర్షపు నీరు చేరి, కాలుష్యం వ్యాప్తిచెందే ప్రమాదముంది.
– గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలి. గ్రామాలకు ఇచ్చినట్లే మున్సిపల్ ఎన్నికల తర్వాత పట్టణాలకూ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తాం.
– పట్టణ పరిపాలనను మరింత పటిష్ట పరిచేవిధంగా సెంటర్ ఆఫ్ అర్బన్ ఎక్స్ లెన్సీ ప్రారంభించాలి.
– గ్రామాల అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనకు, అమలుకు, పర్యవేక్షణ, శిక్షణ కోసం తెలంగాణ స్టేట్ అకాడమీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ ను బలోపేతం చేయాలి.
– గ్రామాలు, పట్టణాల్లో స్మృతి వనాలు ఏర్పాటు చేయాలి. ఎవరైనా పుడితే వారి పేరుమీద మొక్కను నాటాలి. ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకం కోసం చెట్టు పెట్టాలి.
– గ్రామాల్లో వీధిలైట్ల కోసం మీటర్ల బిగింపు వందశాతం పూర్తయిన వెంటనే, మీటరు రీడింగుకు అనుగుణంగా ప్రతినెలా విద్యుత్ బిల్లులను విధిగా చెల్లించాలి.
– మంకీ ఫుడ్ కోర్టుల కోసం అవసరమైన పండ్ల మొక్కలను అటవీశాఖ సరఫరా చేయాలి. అటవీ భూములు ఎక్కువగా లేనిచోట నదులు, ఉప నదులు, కాలువలు, వాగులు, చెరువుల ఒడ్డున కోతులు తినడానికి ఉపయోగపడే పండ్ల చెట్లు పెంచాలి.