రైతులకు సరిపోయేంత యూరియా ఇవ్వాలిః సీఎం

452
kcr
- Advertisement -

రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండుకు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలని చెప్పారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న స్టాకును రైళ్లు, లారీల ద్వారా వెంటనే తెప్పించి, స్టాకు పాయింట్లలో పెట్టకుండా నేరుగా గ్రామాలకే పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువులు అందించే విషయంపై ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్ని యూరియా డిమాండ్ పై విస్తృతంగా చర్చించారు.రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడడానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

1.కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బినిఫిట్ ట్రాన్స ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు ఎరువులను పెద్ద మొత్తంలో తెప్పించలేదు.

2.గత నాలుగు సంవత్సరాలలో ఖరీఫ్ సీజన్లో 6 లక్షల టన్నులకు కాస్త అటూ ఇటూగా యూరియా అవసరం పడింది. ఈసారి ఆగస్టు చివరి నాటికే రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరింది. ఈసారి వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఏకకాలంలో యూరియా అవసరం పడడంతో పాటు, పంటల విస్తీర్ణం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది.

3.రైతుల డిమాండ్ కు అనుగుణంగా వ్యవసాయ శాఖ జాగ్రత్త పడి వివిధ కంపెనీలకు యూరియా ఆర్డర్ పెట్టింది. ఆ యూరియా షిప్పుల ద్వారా రావడంలో ఆలస్యం జరిగింది.
పై కారణాల వల్ల పెరిగిన డిమాండును దృష్టిలో పెట్టుకుని వెంటనే యూరియా తెప్పించి, గ్రామాలకు సరఫరా చేయాలని సిఎం ఆదేశించారు.

ఐడిఎల్, ఇఫ్కో, సిఐఎల్, క్రిబ్ కో, ఎన్ఎఫ్ఎల్ కంపెనీల ద్వారా వచ్చిన దాదాపు లక్షా 15వేల టన్నుల యూరియా ప్రస్తుతం విశాఖపట్నం, కాకినాడు, గంగవరం, కృష్ణపట్నం, న్యూ మంగులూరు నౌకాశ్రయాలకు చేరింది. అక్కడి నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చేరాల్సి ఉంది.
అయితే సాధారణ పద్ధతుల్లో యూరియా రవాణా జరిగితే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి చాలా తొందరగా యూరియా తెప్పించడానికి ఏర్పాట్లు చేశారు.

సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శివప్రసాద్, చీఫ్ ఫ్లీట్ ట్రాఫిక్ మేనేజర్ నాగ్యాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వివిధ ఎయిర్ పోర్టులో ఉన్న యూరియా స్టాకును వెంటనే తెలంగాణ జిల్లాలకు తరలించడానికి 25 ప్రత్యేక గూడ్సులను కేటాయించాలని అభ్యర్థించారు. ఆ గూడ్సు రైళ్ళలో వెంటనే లోడ్ చేయించి, చాలా వేగంగా జిల్లాలకు తరలించాలని కోరారు. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, సనత్ నగర్, ఖమ్మం, కొత్తగూడెం, జడ్చర్ల, తిమ్మాపూర్ తదితర రైల్వే స్టేషన్లకు నేరుగా గూడ్సుల ద్వారా యూరియా పంపాలని కోరారు. దీనికి రైల్వే అధికారులు అంగీకరించారు. శుక్రవారమే తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు గూడ్సు రైళ్లు కేటాయిస్తామని చెప్పారు. వివిధ పోర్టులలో గూడ్సు రైళ్లలో వేగంగా స్టాక్ లోడ్ చేసే పనిని పర్యవేక్షించడానికి ఒక్కో పోర్టుకు ఒక్కో వ్యవసాయశాఖాధికారిని పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రైళ్లలో స్టాక్ రైల్వే స్టేషన్లకు చేరుకోగానే, అక్కడ లారీలను సిద్ధంగా ఉంచాలని, అక్కడ కూడా వ్యవసాయాధికారులను నియమించాలని సిఎం ఆదేశించారు. రైల్వే స్టేషన్ల నుంచి మండలాలు, గ్రామాలకు నేరుగా యూరియా పంపాలని చెప్పారు. కావాల్సిన లారీలను రైల్వే స్టేషన్ల వద్ద సిద్ధంగా ఉంచాలని రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మను ఆదేశించారు. వివిధ పోర్టులలో ఉన్న యూరియాను తక్షణమే రాష్ట్రానికి రప్పించడానికి రైళ్లతో పాటు, 3 వేల లారీలను వాడాలని సిఎం నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని లారీలను వెంటనే పోర్టులకు పంపాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్నినానితో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. . ఎపిలో వీలైనన్ని ఎక్కువ లారీలు సేకరించి, యూరియా తెలంగాణకు పంపుతామని నాని హామీ ఇచ్చారు.

పోర్టుల నుంచి నేరుగా, రైల్వే స్టేషన్ల ద్వారా వచ్చేయూరియాను మళ్లీ స్టాక్ పాయింట్లకు తీసుకుపోకుండా ఏ మండలంలో ఎంత డిమాండ్ ఉందో ముందే నిర్దారించి, నేరుగా పంపాలని, ఈ పనిని పర్యవేక్షించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని సిఎం ఆదేశించారు. మొత్తంగా మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష టన్నుల యూరియా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అందాలని, యూరియా కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితి తొలగిపోవాలని సిఎం ఆదేశించారు.. రాష్ట్రంలో ప్రతీ రైతుకు కావాల్సిన యూరియా అందే వరకు విశ్రమించవద్దని, రేయింబవళ్లు పర్యవేక్షించి, సమస్యను పరిష్కరించాలని సిఎం ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, పార్థసారథి, సునిల్ శర్మ, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -