ఈవానకాలం నుంచే కాళేశ్వరం నీళ్లుః సీఎం కేసీఆర్

246
kcr
- Advertisement -

ఈ వానకాలం సీజన్‌లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు అందించాలని, ఇందుకు అనువుగా జూన్ నాటికే కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోభాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఈ వానకాలంలోనే నీటిని ఎత్తిపోయడం ప్రారంభమవుతుందని, ఆ నీటిని మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లకు తరలిస్తామని చెప్పారు. ఈ రెండుడ్యామ్‌లలో 50 టీఎంసీల నిల్వసామర్థ్యం ఉంటుందని, ఆ నీటితో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా అన్ని చెరువులు నింపాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ఆయకట్టుకు నీరందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నదో గుర్తించి, అప్పటికప్పుడే పరిష్కరించారు. భూసేకరణకు, ఇతర పనులకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు.

cm-kcr
గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. వాటిని ఎత్తిపోయడానికి భారీవ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నం. ఈ ఏడాది వానకాలం నుంచే మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్‌మానేరు, లోయర్ మానేరుడ్యామ్‌లకు తరలిస్తాం. అక్కడి నుంచి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా అన్ని చెరువులకు మళ్లించాలి అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చెరువులను నింపడమే ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించాలని, ఇందుకోసం ఎస్సారెస్పీ కాల్వలన్నింటినీ మరమ్మతు చేయాలన్నారు. కావాల్సినచోట తూములు నిర్మించాలని, భూసేకరణతోపాటు, రెండోఫేజ్‌లో నిర్మించిన కాల్వలకు లైనింగ్ పూర్తిచేయాలని సూచించారు. ఎక్కడ ఏ పనిచేయాలో 50 మంది ఇంజినీర్లను నియమించుకుని యుద్ధప్రాతిపదికన సర్వేచేసి, అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. అవసరమైన అన్నినిధులనూ వెంటనే మంజూరుచేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ వానకాలానికి ఎస్సారెస్పీ పరిధిలోని 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని పేర్కొన్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతం నుంచి మొదలుకుని చివరి ఆయకట్టు కలిగిన డోర్నకల్, తుంగతుర్తి, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల వరకు అన్ని దిక్కులకూ సాగునీరందాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్కే జోషి, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, నీటిపారుదలశాఖ ఈఎన్సీలు మురళీధర్, అనిల్‌కుమార్, నాగేందర్, సీఈలు శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బాల్కసుమన్, సుంకె రవిశంకర్, సంజయ్‌కుమార్, కోరుకంటి చందర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గాదరి కిశోర్, నన్నపునేని నరేందర్, వీ సతీశ్, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -