డ్యూటీలో ఉన్న అటవీశాఖ అధికారిణిపై జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. కోనేరు కృష్ణ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు సీఎం కేసీఆర్. అలాగే భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారట సీఎం కేసీఆర్.
మరోవైపు ఈఘటనపై స్పందించారు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. అధికారులపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప, భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. కాగా కాసేపటి క్రితమే తన పదవికి రాజీనామా చేశారు జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ. తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్ ను పంపించారు.