కరోనా తగ్గుతుండడం శుభసూచికం- సీఎం కేసీఆర్

196
cm kcr
- Advertisement -

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా ఆక్టివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారుతున్నాయని సిఎం ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన వారిలో కూడా 97 శాతానికి పైగా పేషంట్లు కోలుకుని, డిశ్చార్జి అవుతుండడం మంచి పరిణామమన్నారు. వైరస్ వ్యాప్తి,ప్రభావం బాగా తగ్గుతున్నందున రాష్ట్రంలో కంటైన్మెంట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు ప్రకటించారు.మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ సోకుతున్న వారి లింక్ మొత్తం గుర్తించి, అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ధోరణి (ట్రెండ్) చూస్తుంటే వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గిందన్నారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ పాజిటివ్ కేసులు వచ్చినా, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని సిఎం ప్రకటించారు.

సోమవారం ప్రధానమంత్రితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ,టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కరోనా వైరస్ వ్యాప్తి,రోగులకు అందుతున్న చికిత్స, సహాయ కార్యక్రమాలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలను సిఎం సుదీర్ఘంగా,లోతుగా సమీక్షించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు వైద్యశాఖ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. సోమవారం 159 మందికి పరీక్షలు నిర్వహించగా, కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు.సోమవారం 16 మంది డిశ్చార్జి అయినట్లు సిఎంకు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నట్లు చెప్పారు. మొదట విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా, తర్వాత మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారా వైరస్ మన రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలకు పాకిందన్నారు. అయితే పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ వారి లింకులన్నింటినీ దొరకబట్టి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

‘‘రాష్ట్రంలో వైరస్ పాజిటివ్ వచ్చిన వారు సోమవారం నాటికి 1003 మంది కాగా, అందులో 332 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 646 పాజిటివ్ కేసులున్నాయి. మొత్తం పది జిల్లాల్లో (ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల) ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. మరో 11 జిల్లాలు(జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ) మంగళవారం (ఏప్రిల్ 28) నాటికి ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారనున్నాయి. హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో చాలా తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయి.

జిహెచ్ఎంసి పరిధిలో 30 సర్కిళ్లు ఉంటే, చాలా సర్కిళ్లలో పాజిటివ్ కేసులు లేవు. కొన్సి సర్కిళ్లు ఆక్టివ్ కేసులు లేని సర్కిళ్లుగా మారాయి. కొన్న సర్కిళ్లకే వైరస్ పరిమితమైంది. దీంతో చాలా కంటైన్మెంట్లు ఫ్రీ అవుతున్నాయి. యాక్టివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ కంటైన్మెంట్ల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరస్ సోకిన వారిలో అత్యధిక శాతం మంది క్వారంటైన్ పీరియడ్ మే 8 నాటికి ముగుస్తున్నది. కొద్ది రోజులుగా పరిస్థితి గమనిస్తుంటే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క పాజిటివ్ కూడా రాని పరిస్థితి వస్తుందనే నమ్మకం ఏర్పడుతున్నది. ఆ తర్వాత అక్కడో ఇక్కడో కొద్దో గొప్పో కేసులు వచ్చనా వెంటనే గుర్తించి, తగు చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. వైరస్ సోకిన వారిని గుర్తించడానికి వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ ఎంతగానో శ్రమిస్తున్నది. మొదట విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా మాత్రమే వైరస్ సోకుతున్నట్లు తేలింది. తర్వాత మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారా వైరస్ వచ్చినట్లు గ్రహించాం. విదేశాల నుంచి వచ్చిన వారినీ, మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహించాం. వారిలో పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి, ఆసుపత్రిలో పెట్టి చికిత్స చేశాం. పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి, వారికీ పరీక్షలు నిర్వహించాం. మళ్లీ వారిలో ఎవరికి పాజిటివ్ వచ్చిందో గుర్తించి, వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి, పరీక్షలు నిర్వహిస్తూ పోతున్నాం. సోమవారం జరిపిన పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారిద్దరినీ ఆసుపత్రిలో పెట్టి చికిత్స చేయడంతో పాటు, వారు ఎవరెవరిని కలిశారనే లింక్ దొరకబట్టి వారికీ పరీక్షలు నిర్వహిస్తాం. వారిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే, వారి ద్వారా లింకు దొరకబట్టి అందరికీ పరీక్షలు చేసుకుంటూ పోతాం. లింకులో చివరి వ్యక్తి వరకు అందరినీ గుర్తించి, పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతుంది. మర్కజ్ లింకు లేకున్నా రోజుకు దాదాపు వంద మంది వరకు వైరస్ లక్షణాలు కనిపించిన వారిని కూడా పరీక్షిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

‘‘పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన ప్రభుత్వం ఏమాత్రం ఉదాసీనంగా ఉండదు. ప్రతీక్షణం అప్రమత్తంగానే ఉంటాం. మళ్లీ ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చి, కేసుల సంఖ్య పెరిగినా సరే, సమర్థంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంది. టెస్టింగ్ కిట్స్, పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు, ఇతర మాత్రలు, పరికరాలు, బెడ్సు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని కేసులొచ్చినా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చికిత్స చేయడానికి సర్వసన్నద్ధమయి ఉన్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

‘‘రాష్ట్రంలో ముందు ప్రకటించినట్లు మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. అన్ని మతాల వారు తమ ప్రార్థనా కార్యక్రమాలను, పండుగలను ఇండ్లలోనే చేసుకోవాలి. పాజిటివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ, ఆక్టివ్ కేసులు లేని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిస్తాం. కానీ కంటైన్మెంట్ కొనసాగుతున్న ప్రాంతాల్లో మాత్రం ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.

- Advertisement -