తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవడం అభినందనీయమన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్…స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడంలో సహకరించిన కాంగ్రెస్,బీజేపీ,ఎంఐఎం నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
సింగిల్ విండో ఛైర్మన్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మీరు అంచెలంచెలుగా ఎమ్మెల్యేగా పనిచేశారని తెలిపారు. పంచాయతీ రాజ్,గనుల శాఖ మంత్రిగా,వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారని కొనియాడారు. వ్యవసాయశాఖమంత్రిగా తెలంగాణకే మంచిపేరు తెచ్చారని చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి రైతుబంధు,రైతు భీమా వంటి పథకాలను తీసుకొచ్చారని చెప్పారు.మీ నాయకత్వంలో అద్భుతాలు జరిగాయని రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. దేశ ఆర్ధిక,విద్యావేత్తలు రైతుబంధు పథకాన్ని కొనియాడారని చెప్పారు.అందుకే తమరికి తాను లక్ష్మీపుత్రుడని చెప్పానని చెప్పారు. ప్రజాసేవలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం మీ పనితనానికి నిదర్శనమన్నారు.1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.రానున్న రోజుల్లో మరిన్ని విజయావకాశాలను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకున్నారు సీఎం కేసీఆర్.