మహాత్మా జ్యోతిరావు ఫూలేకు సీఎం కేసీఆర్‌ నివాళి..

157
cm kcr
- Advertisement -

కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195వ జయంతి ( 11 ఏప్రిల్) సందర్భంగా సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. దేశానికి ఫూలే అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతికోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని సీఎం తెలిపారు. కుల,లింగ వివక్షకు తావు లేకుండా, విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్ధిక సమున్నతికి బాటలు పడతాయనే మహాత్మా ఫూలే ఆలోచన విధానాన్నే స్పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

కుల వృత్తులకు సామాజిక గౌరవం ఆర్ధిక గౌరవాన్ని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆరున్నర ఏండ్ల తెలంగాణ స్వయం పాలనా పక్రియ, ఫూలే వంటి మహనీయుల స్పూర్తితోనే కొనసాగుతున్నదని సీఎం అన్నారు. ఏటా దాదాపు రూ. 45 వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు వెనకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా వర్గాల సమున్నతి కోసం ఉపయోగపడుతున్నాయని సీఎం అన్నారు. అభివృద్ది సంక్షేమ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నవని.. విద్యా రంగంలో తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదన్నారు. మహాత్మాఫూలే విదేశీ విద్యానిధి.. పేరుతో విదేశీ విద్యను ప్రభుత్వ ఖర్చుతో బడుగు బలహీన వర్గాలకు అందచేస్తున్నదని సీఎం తెలిపారు.

గురుకుల విద్యావ్యవస్థల్లో సాధిస్తున్న ఫలితాలు, జ్యోతిబాఫూలే అందించిన స్పూర్తి ఫలాలేనని సీఎం అన్నారు. బాల్య వివాహాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు, సత్పలితాలనిస్తున్నాయన్నారు. మహిళలకు విద్య, వైద్యం, రక్షణ కోసం ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి సదుపాయాలను ప్రభుత్వం మెరుగు పరిచిందన్నారు. హైదరాబాద్‌లో విలువైన స్థలాలను కేటాయించి తెలంగాణలోని బీసీలు,ఎంబీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టిందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆర్ధిక పురోగతికి దోహదపడుతూ, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ, దేశానికే ఆదర్శంగా నిలవడం వెనక మహాత్మా ఫూలే వంటి దార్శనికుల స్పూర్తి ఇమిడివున్నదని సీఎం తెలిపారు.

- Advertisement -