ప్రముఖ చిత్రకారుడు గోపి (లూసగాని గోపాల్ గౌడ్) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా కార్టూనిస్ట్ గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచిన పాలమూరుకు చెందిన గోపి మరణంతో, తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత గోపి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా, కాన్వాస్‌పై తన బొమ్మలతో తెలుగు సాహిత్య, చిత్ర సీమను హోయలు పలికించి తనదైన ముద్ర వేసుకున్న చిత్రకారుడు గోపి. 69 ఏళ్ల గోపి శుక్రవారం కొవిడ్‌తో కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలతో పాటు మధుమేహంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కోవిడ్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గోపి అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య,ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.