వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించామని తెలిపారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా మాట్లాడిన సీఎం…సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత, వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయిందన్నారు. ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన నాకు ఆనాడు రైతాంగం దుస్థితిని చూసి మనసు వికలమైందన్నారు.
రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, పథకాలూ అమలులోకి తేవటంతో మన రాష్ట్రం సజల సుజల సస్యశ్యామల తెలంగాణ గా మారిందన్నారు. రైతన్నల రుణభారం తగ్గించడానికి రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవటం, ప్రతీ 5వేల ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం చేపట్టామన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ రైతన్నలకు ఇంతటి సౌకర్యాలు లేనేలేవంటే అతిశయోక్తి కాదన్నారు.
రాష్ట్ర అవతరణ అనంతరం మిషన్ కాకతీయ పేరుతో పెద్దఎత్తున ఈ చెరువులను పునరుద్ధరించుకున్నాం. 15 లక్షలకుపైగా ఎకరాల సాగుభూమిని స్థిరీకరించుకున్నాం అన్నారు. కరెంటు కష్టాలకు చెరమగీతం పాడిన రాష్ట్రం తెలంగాణ నిలిచింది. ఈనాడు రాష్ట్రంలో అన్నిరంగాలకు నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పేందుకు నేను గర్విస్తున్నాను అని చెప్పారు.