తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 36 నమోదయ్యాయని వీరిలో ఒకరు రీకవరి అయ్యారని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం …హోం క్వారెంటైన్‌లో ఉన్న వారి పాస్ పోర్టులు సీజ్ చేస్తున్నామని తెలిపారు.
114 మందికి కరోనా ఉన్నట్లు అనుమానం ఉందని…త్వరలో రిపోర్టు వస్తుందన్నారు. కరోనా భయంకరమైన సమస్య అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా సోకని దేశం లేదని రిపోర్టులు చెబుతున్నాయన్నారు. నేటి నుంచి సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తెలిపారు.తెలంగాణలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.
అమెరికాలాంటి దేశంలో కరోనాను కంట్రోల్ చేయలేక ఆర్మీని రంగంలోకి దించారని తెలిపారు. మనం అలాంటి పరిస్ధితి తెచ్చుకోవద్దన్నారు. కరోనాపై పాజిటివ్ డైరెక్షన్‌లో అవేర్ నెస్ తేవాలన్నారు. షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు.
ప్రజాప్రతినిధులు రంగంలోకి కరోనాను కంట్రోల్ చేయాలన్నారు. స్ధానిక పోలీసులతో కలిసి విధిగా ప్రజలతో కలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామపంచాయతీ స్టాండింగ్ కమిటీలు పనిచేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. వార్డు మెంబర్ల దగ్గరి నుండి సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పీటీసీలు,సింగిల్ విండో ఛైర్మన్లు అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందామని చెప్పారు.
తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున వాహనాలు చేరుకుని ఉన్నాయని ఈ ఒక్కరోజు టోల్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు డయల్ 100కి ఫోన్ చేసి అత్యవసర పరిస్ధితుల్లో వినియోగించుకోవాలన్నారు.
కూరగాయల ధరలు,నిత్యావసర ధరలు పెంచినట్లు వార్తలు వస్తున్నాయని ఎక్కువ ధరకు కూరగాయలు అమ్మితే పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. ఉపాధి హామీ పథకం యధావిధంగా కొనసాగుతాయని చెప్పారు.