పీవీకి భారతరత్న…అసెంబ్లీ తీర్మానం

217
kcr
- Advertisement -

తెలంగాణ ముద్దుబిడ్డ,భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తీర్మానం ప్రవేశ పెట్టిన అనంతరం మాట్లాడిన సీఎం…పీవీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్ర‌వేశ‌పెడుతున్నాం అన్నారు.

పీవీ బహుముఖ ప్ర‌జ్ఞ‌శాలి, బహుభాషా కోవిదుడు. నూత‌న ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టిన గొప్ప వ్యక్తి అన్నారు. 135 కోట్ల జనాభా ఉన్న ప్రజాస్వామిక దేశంలో ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్దిమందికే దక్కుతుందని అలాంటి వారిలో పీవీ ఒకరని తెలిపారు.తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప‌తాక అయిన పీవీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను సంవ‌త్స‌రం పాటు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దేశానికి చేసిన సేవ‌ల‌ను ప్ర‌జ‌లంద‌రూ స్మ‌రించుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆశిస్తుందన్నారు. ప్ర‌ధాని ప‌ద‌వికి చేప‌ట్టిన మొట్టమొద‌టి ద‌క్షిణాది వ్య‌క్తి. నూత‌న ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన మహానీయుడు పీవీ అని కొనియాడారు సీఎం కేసీఆర్‌.

రాజ‌కీయాల‌తో సంబంధంలోని ఆర్థిక‌వేత్త మ‌న్మోహ‌న్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియ‌మించి పీవీ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారని గుర్తుచేశారు.గ్లోబ‌ల్ ఇండియా రూప‌శిల్పి పీవీ. పీవీ ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితాల‌ను నేడు మ‌నం అనుభ‌విస్తున్నాం. ఆధునిక భార‌త‌దేశాన్ని నిర్మించిన రెండో వ్య‌క్తి పీవీ అన్నారు.మూడు ద‌శాబ్దాలు చైనా స‌రిహ‌ద్దు ప్ర‌శాంతంగా ఉండ‌డానికి పీవీనే కార‌ణం. భూసంస్క‌ర‌ణ‌ల‌ను చిత్త‌శుద్దితో అమ‌లు చేశారు. రాష్ర్ట విద్యామంత్రిగా గురుకుల పాఠ‌శాల‌లు ప్రారంభించారు. కేంద్రంలో మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రిగా న‌వోద‌య విద్యాల‌యాలు ప్రారంభించారని తెలిపారు. అలాంటి మ‌హోన్న‌త వ్య‌క్తికి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని తెలిపారు.

- Advertisement -