సీఎం కేసీఆర్‌పై గవర్నర్ ప్రశంసలు…..

186
Kcr meets Governor
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర్థ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. చీకటి నుంచి వెలుగులోకి నడిపించిన డైనమిక్ లీడర్ కేసీఆర్ అని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR Met Governor Narasimhan at Raj Bhavan

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ… కేసీఆర్‌ ప్రభుత్వం సాధించిన విజయాలు, ఆవిష్కరణలపై పొగడ్తల జల్లు కురిపించారు. ‘‘రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఎవరి సలహాలనైనా కేసీఆర్‌ తీసుకుంటారు. ఇలాంటి సీఎంను నిజంగా నేనెప్పుడూ చూడలేదు. ఆయనకు ఓ ఆలోచన వచ్చిందంటే చాలు… ఎంతటి అవాంతరాలు ఎదురైనా అమలు చేసేంత వరకు వెనక్కి తగ్గరు’’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌వనగా నిలుస్తుందని, 2017లో తెలంగాణ మరిన్ని విజయాలను సాధిస్తుందని అన్నారు.

CM KCR Met Governor Narasimhan at Raj Bhavan

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న లక్ష్యంతో సర్కారు చేపట్టిన మిషన భగీరథ పథకం ఒక నీటి తొట్టిలాంటిందని గవర్నర్‌ అన్నారు. ఇప్పటికే ఈ పథకానికి చాలా అభినందనలు, ప్రశంసలు వచ్చాయన్నారు. భగీరథ పథకం ఈ ఏడాది ఆఖరుకు పూర్తవుతుందని.. మిషన కాకతీయ పథకంలో రెండు దశలు పూర్తయ్యాయన్నారు. వీటితో పాటు ఇతర నీటి పారుదల పథకాలు, కార్యక్రమాలు త్వరలోనే ఫలాలు అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి రంగానికి చాలినంత నీరు రాష్ట్రంలో ఉందన్నారు. విద్యుత రంగంలో రాష్ట్రం గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం నెలకొంటుందని, రాష్ట్రంలో విద్యుత సంక్షోభం ఏర్పడుతుందని, ఉత్పత్తి, సరఫరా తగ్గుతాయన్న భయాందోళనలు ఉండేవన్నారు. కానీ, ఈ అపనమ్మకాలను కేసీఆర్‌ తిప్పికొట్టారని కొనియాడారు. విద్యుత కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది, తమసోమా జ్యోతిర్గమయ (చీకటి నుంచి వెలుగులోకి ప్రస్థానం) అన్నట్లుగా కొత్త నిర్వచనం ఇచ్చారన్నారు.

CM KCR Met Governor Narasimhan at Raj Bhavan

కేసీఆర్ ప్రభుత్వం మంచి టీమ్ స్పిరిట్‌తో పనిచేస్తున్నదని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు పైనుంచి కింది స్థాయివరకు ఒక కుటుంబంగా, కష్టపడి, సమన్వయంతో పనిచేస్తున్నారని విశ్లేషించారు. టీమ్ స్పిరిట్‌ను తీసుకురావడంలో కేసీఆర్ ప్రత్యేక కృషి జరిపారని తెలిపారు. సమాజంలో అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపాలని గవర్నర్ అభిలషించారు. అదే దారిలో ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన చర్యలను తీసుకుంటున్నదన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల అవినీతి నిర్మూలన జరిగి సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు సకాలంలో పూర్తయి, త్వరలోనే ప్రజలకు పూర్తి ఫలాలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. అవినీతి లేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేయాలని సూచించారు. అధికారులకు ఏదైనా మంచి పని అనిపిస్తే దానిని అదే రోజు పూర్తి చేయాలి. అది దశాబ్దాల వరకు పునాదిగా ఉంటుంది. ఈ క్రమంలో అధికారులందరూ సహకరించి ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి సహకరించాలి అని గవర్నర్ కోరారు.

CM KCR Met Governor Narasimhan at Raj Bhavan

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పైనా గవర్నర్‌ అభినందనల జల్లు కురిపించారు. ఇన్ఫర్మేషన టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ఆయన నంబర్‌వనగా నిలిపారని కితాబిచ్చారు. ‘ధనిక, మేధావి వర్గాలకే ఐటీ పరిమితమైందన్న అభిప్రాయాలుండేవి. ప్రభుత్వ విధానాలతో ఐటీ సామాన్యుల దరికి చేరింది’ అని చెప్పారు. టీ-హబ్‌ అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప అన్వేషణ అని కొనియాడారు.

రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,ప్రజలు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ దంపతులు విద్యార్థుల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు.

- Advertisement -