ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వచన్ సదన్ లో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలు, పలు అంశాలపై సునీల్ అరోరాతో సీఎం కేసీఆర్ చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్‌ను ఇండిపెండెంట్లకు కేటాయించడం వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు.
కారు డూప్ సింబల్స్ అయిన ట్రక్కు, ఆటో, ఇస్త్రీ పెట్టే లాంటి గుర్తులు ఎవరికీ కేటాయించొద్దని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇలాంటి పొరపాటు జరక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఓట్ల గల్లంతు సమస్యని పరిష్కరించాలని కోరారు.
తెలంగాణలో సుమారు 22లక్షల ఓట్లు గల్లంతైన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకుని విశ్లేషణ చేయించాలని ఎన్నికల అధికారిని కోరారు. లోక్‌సభ ఎన్నికల లోపు ఓటర్ల జాబితాలో సవరణలు, సంస్కరణల పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర మానవ వనరులశాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో సీట్లు పెంచాలని కోరగా టీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.