ఇదే గొప్ప కిరీటం..!

248
CM KCR Launches Sheep Distribution Scheme
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ డోలు వాయించి అర్హులైన గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ, బీమా పత్రాలను అందజేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కొండపాక మండలంలోని 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. ఒక్కో యూనిట్‌లో 21 జీవాలుంటాయి. ఇందులో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉన్నాయి.సభా వేదిక వద్దకు చేరుకునే ముందు సీఎం కేసీఆర్ ఆప్యాయంగా గొల్లకురుమలను పలకరించారు.

వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గొర్రెల స్టాళ్లను పరిశీలించారు సీఎం. పలు స్టాళ్ల వద్ద గొల్లకురుమలతో కలిసి సీఎం కేసీఆర్ ఫోటోలు దిగారు. వేదికపైకి చేరుకున్న సీఎం ప్రజలకు అభివాదం చేశారు. గొల్లకురుమలు ధరించే రుమాలు, గొంగడి ధరించిన సీఎం కురుమల డోలు వాయించారు. గొళ్లకురుమలు అందజేసిన రుమాలే గొప్ప కీటంగా.. ధరించిన సీఎం గొల్లకురుమలకు ప్రతీకగా దర్శనమిచ్చారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 1500 యూనిట్ల గొర్రెల పంపిణీ జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు. 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేశారు. ఈ ఏడాదికి 3,60,098 మందికి గొర్రెల యూనిట్లు రాగా, వచ్చే ఏడాది మరో 3,57,971 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి 8,710 గ్రామ పంచాయతీల్లో 7,846 సొసైటీల్లో 7,18,069 మంది(18 సంవత్సరాలు నిండిన వారు) సభ్యులుగా చేరారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 100 సంచార పశువైద్యశాలలను అందుబాటులోకి తేనున్నారు. సంచార వైద్యశాలల ద్వారా మంద వద్దకే మందులు పంపనున్నారు. ఏడాదికి 3 సార్లు క్రమం తప్పకుండా నట్టల మందు, టీకాలు వేయనున్నారు. ప్రతీ జిల్లాలో 4 టన్నుల ైస్టెలో గడ్డి విత్తనాలు సరఫరా చేయనున్నారు. ప్రతీ గొర్రెకు ప్రభుత్వ ప్రీమియంతో భీమా సౌకర్యం కల్పించనున్నారు.

- Advertisement -