మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర్య భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. పబ్లిక్ గార్డెన్స్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్… దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
దండి యాత్రలో ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు…. అరేబియా సముద్రం తీరాను పిడికెడు ఉప్పు చేతబట్టి.. మహాత్మాగాంధీ సింహంలా గర్జించారు. గాంధీ చేపట్టిన దండి యాత్రలో హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు పాల్గొన్నారని గుర్తు చేశారు. దండి యాత్ర స్వాతంత్ర్య సంగ్రామంలో అద్భుత ఘట్టమని సీఎం అన్నారు.
రాష్ర్టంలో 75 వారాల పాటు అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న రమణాచారి ఈ కమిటీ అధ్యక్షులుగా నియమించుకుని ముందుకు కొనసాగుతున్నామని తెలిపారు. ఈ వేడుకల కోసం రూ. 25 కోట్లు కేటాయించామని చెప్పారు.
బ్రిటీష్ వారు తెచ్చిన ఉప్పు చట్టం దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిందని గాంధీ గ్రహించారు. దీంతో గాంధీ 1930, మార్చి 12న ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా దండి వరకు గాంధీ పాదయాత్ర చేశారు. ఉప్పు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని గాంధీ డిమాండ్ చేశారు. నవీన తరం వారికి స్వాతంత్ర్య పోరాటాన్ని తెలియజేసేందుకు రమణాచారి ఆధ్వర్యంలో కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుందన్నారు. అన్ని విద్యాసంస్థల్లో వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.