తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని సిఎం అన్నారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు. సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని సిఎం ప్రకటించారు.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు అంజనీ కుమార్, విసి సజ్జనార్, మహేశ్ భగవత్, అడిషనల్ డిజిపి జితేందర్, ఐజిలు స్టీఫెన్ రవీంద్ర, వై. నాగిరెడ్డి, నిజామాబాద్ ఐజి శివ శంకర్ రెడ్డి, వరంగల్ ఐజి ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘‘జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ది పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నారు. అయినప్పటికీ సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు వారి కవ్వింపు మాటలను, అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలు కూడా హైదరాబాద్ లో నడవవు అని వారికి తెలిసింది. దీంతో వారు మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని ఏ కరీంనగర్లోనో, వరంగల్ లోనో, ఖమ్మంలోనో, మరో చోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్ లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఏదో ఓ చోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థనా మందిరాల దగ్గర ఏదో ఓ వికృత చేష్ట చేయాలని చూస్తున్నారు. అలా చేసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పెద్ద ఎత్తున గొడవలు చేసి, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అసలు జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది’’ అని సిఎం కేసీఆర్ చెప్పారు.
‘‘హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయవద్దు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని నిబద్ధతతో పనిచేసి రాష్ట్రాన్ని ఓ దరికి తెచ్చాం. శాంతిభద్రతల పరిరిక్షణలో రాజీలేకుండా వ్యవహరిస్తున్నాం. పేకాట కబ్బులు, గుడుంబా లాంటి మహమ్మారులను దూరం చేశాం. సంఘ విద్రోహ శక్తుల పట్ల, మాఫియాల పట్ల, విచ్చిన్నకర శక్తుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలు చూశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. శాంతి భద్రతలను కాపాడే విషయంలో, సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి రాజీలేని ధోరణి అవలంభిస్తున్నది. కాబట్టే నేడు హైదరాబాద్ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎవరి పని వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అనే మంచి పేరు వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు నగరానికి వస్తున్నాయి. యువకులకు ఉపాధి దొరుకుతున్నది. హైదరాబాద్ మహా నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు కోటి 60 లక్షల జనాభా ఉంది. ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికున్న ప్రధాన బాధ్యత. ప్రభుత్వానికి ఈ రాష్ట్రం బాగుండడం ముఖ్యం. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. ఇక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడం ముఖ్యం. ప్రశాంత హైదరాబాద్ నగరంలో, తెలంగాణకు గుండె కాయ లాంటి హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ఘర్షణలు పెట్టి, రాజకీయ లబ్ది పొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రశాంతతను ఫణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదు. ఘర్షణలు సృష్టించే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఎంతటి వారినైనా సరే, వారు అధికార పార్టీ సభ్యులైనా సరే వదలొద్దు. ఎక్కడికక్కడ సమాచారం సేకరించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలి’’ అని సిఎం స్పష్టం చేశారు.
ప్రశాంత హైదరాబాద్ లో మత చిచ్చు పెట్టడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నాలు చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువకులను కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు.పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో అరాచక, సంఘ విద్రోహ శక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు.