తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడకలో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తమ గ్రామానికి విచ్చేస్తుండటంతో సంతోష పడుతున్నారు గ్రామస్తులు. దీంతో చింతమడకలోని ప్రతి ఇళ్లు సుందరంగా పూలతో అలంకరించారు. గ్రామప్రజలు ఇంటింటినీ మామిడి తోరణాలు కట్టుకుని అలంకరించుకున్నారు.ఇక నేడు చింతమడకలో సీఎం కేసీఆర్ పర్యటించనున్న సంగతి తెలిసిందే. గ్రామ ప్రజలు, తనచిన్ననాటి స్నేహితులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించడం ద్వారా ఊరు దశ, దిశను మార్చడం, గ్రామస్థుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం ఈ పర్యటన ఉద్దేశంగా చెబుతున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉద యం 11 గంటలకు చింతమడకకు కేసీఆర్ చేరుకుంటారు.
గ్రామంలో కాలినడకన పర్యటిస్తూ పలు ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం ఆత్మీయ సమావేశంలో పాల్గొంటా రు. తర్వాత వనభోజనాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, కలెక్టర్ వెంకట్రామారెడ్డి, సీపీ జోయల్ డేవీస్ వారం రోజులుగా ఏర్పాట్లను పూర్తిచేయించారు. సీఎం కేసీఆర్ రాకతో గ్రామంలో భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు.