వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదివారం(అక్టోబర్-22)న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపనం చేయడం సంతోషకరంగా ఉందన్న సీఎం.. ఈ పార్క్ ఏర్పాటుతో లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే ఆగస్టు లోపు వరంగల్‌కు కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయని.. కాళేశ్వరం నీళ్లతో రైతులు బంగారం పండించ వచ్చని సీఎం అన్నారు. త్వరలోనే పారిశ్రామిక, వ్యవసాయ, విద్యా రంగంలో వరంగల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బంగారు వరంగల్ అవుతుందన్న ఆయన ఆ తర్వాతే బంగారు తెలంగాణ అవుతుందన్నారు.
లక్ష మందికి పైగా ఉపాధి:
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఒక్క రోజే 22 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని.. పారిశ్రామికవేత్తలు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం సంతోషాన్నిస్తుందన్నారు. ఈ ఒప్పందాల వల్ల 3,900 కోట్ల రూపాయాల పెట్టబుడులు రానున్నాయని తెలిపారు సీఎం. ఆదివారం(అక్టోబర్-22)న జరిగిన ఒప్పందాలతో 27 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్న మన నేతన్నలు.. తిరిగి రాష్ర్టానికి రావాలని కోరుతున్నానని చెప్పారు. భూములు కోల్పోయిన ప్రతీ ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్న ఆయన.. నిర్వాసితులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు.
వరంగల్ జిల్లా ప్రజలను అభినందిస్తున్నా:
భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేయించుకున్నందుకు మీ అందరిని అభినందిస్తున్నానని సీఎం చెప్పారు. తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో మన వరంగల్ చుట్టుపక్కల ఉండే వర్ధన్నపేట, పరకాలతో పాటు ఇతర నియోజకవర్గాల ప్రజలు సోలాపూర్, భీవండి, సూరత్‌తో పాటు పలు ప్రాంతాలకు వెళ్లారని గుర్తు చేశారు. అక్కడికి వలస వెళ్లిన వారు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తూ.. ఉద్యమం చేశారు. ఉద్యమ సమయంలో వారిని పిలిచి మాట్లాడటం జరిగిందని, అజంజాహీ మిల్లు మూతబడింది కాబట్టి అక్కడికి వలస వెళ్లామని చెప్పారు. అజంజాహీ మిల్లును తలదన్నేలా వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రాబోతుందని ఆనాడే చెప్పానన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం.
అంతర్జాతీయ ప్రామాణిక దుస్తుల ఉత్పత్తి:
కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో అంతర్జాతీయ ప్రామాణిక దుస్తుల ఉత్పత్తి జరుగుతదని సీఎం చెప్పారు. సూరత్‌లో మహిళలు ధరించే వస్ర్తాలు తయారు చేస్తారని.. తమిళనాడులో అండర్ గార్మెంట్స్, షోలాపూర్‌లో దుప్పట్లు, రగ్గులు తయారు చేస్తారన్నారు. సూరత్, షోలాపూర్, తమిళనాడు కలయికే వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ అని స్పష్టం చేశారు కేసీఆర్. ఈ పార్క్‌లో అన్ని రకాల దుస్తులను తయారు చేస్తారని తెలిపిన సీఎం.. పత్తి నుంచి మనం వేసుకునే బట్టల వరకు వరంగల్‌లోనే తయారు అవుతాయని తెలిపారు.